ఊరూపేరు లేని 'ఉర్సా'

పంచుకుతినేందుకే రూ.3,000 కోట్ల భూమి పందేరం..

హైదరాబాద్‌లో కనీసం కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ ‘ఉర్సా క్లస్టర్స్‌’ 

ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ చిరునామాతో 2 నెలల క్రితమే ఏర్పాటు

అక్కడ ఒక్క ఉద్యోగీ లేరు.. వాణిజ్య కార్యకలాపాలూ లేవు.. వాడుకునేది గృహ విద్యుత్తు  

నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది ఓ కుటుంబం..

అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్‌ ఎల్‌ఎల్‌సీ పరిస్థితి కూడా అంతే 

గతేడాది లోకేశ్‌ పర్యటనకు నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటు

కనీసం ఆఫీసు, వెబ్‌సైట్, ఫోన్‌ నెంబర్‌ కూడా లేని డొల్ల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 

డేటా సెంటర్, ఐటా క్యాంపస్‌ అంటూ.. విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 60 ఎకరాల భూమి ధారాదత్తం 

కారుచౌకగా ఎకరా 99 పైసలకే కేటాయించేలా ప్రణాళిక.. రూ.3,000 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగడ..  

ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరి తెగించి భూ కేటాయింపులు చేసి ఉండదు.. 

‘ఉర్సా’తో ముఖ్యనేతల కుమ్మక్కుపై ‘‘సాక్షి’’ పరిశోధనలో బయటపడ్డ నిజాలు

అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..?  
నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..?  
కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. 

ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్‌’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్‌ నెంబర్, వెబ్‌సైట్‌ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..!  
సొంత కార్యాలయం.. కనీసం ఫోన్‌ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. 

‘ఉర్సా క్లస్టర్స్‌’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్‌లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్‌ నెంబర్‌ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని  ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  

భూ కేటాయింపులకు పచ్చజెండా.. 
ఉర్సా క్లస్టర్స్‌ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సా

కుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట..

 

ఇంకో డైరెక్టర్‌ కథ ఇదీ.. 

తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్‌ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. 

హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! 
కేరాఫ్‌ అడ్రస్‌ ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌
రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్‌ హైదరాబాద్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్‌ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్‌ నెంబర్‌ 705, ఏక్తా బాసిల్‌ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. 

అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్‌ రూమ్‌ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్‌లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. 

ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్‌ వాణిజ్య విద్యుత్‌ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్‌ నెంబర్‌ 705 విద్యుత్‌ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్‌ కంపెనీకి కనీసం ఓ ఫోన్‌ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్‌ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు.  

అమెరికాలోనూ అంతే.. లోకేశ్‌ పర్యటనకు నెల ముందు...!
ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్‌ ఎల్‌ఎల్‌సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్‌ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్‌ 27న ఉర్సా క్లస్టర్స్‌ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్‌ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్‌ తనయుడు కౌశిక్‌ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. 

ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్‌ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్‌ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్‌ నెంబర్లు లేవు. కౌశిక్‌ పెందుర్తి ప్రస్తుతం టాలస్‌ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్‌ ఖాతా ద్వారా తెలుస్తోంది. 

అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగి. మరో డైరెక్టర్‌ సతీష్‌ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.

‘ఐఎంజీ భారత్‌’ను మించిన స్కామ్‌..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్‌’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్‌ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్‌ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్‌’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్‌ గుర్తుకొస్తోందని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.  

Back to Top