తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్ధుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజానోటిఫికేషన్‌ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు. టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సందేహాలు డీఎస్‌సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్‌లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు? గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్‌ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైయస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా? తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్‌లో పిటీషన్ వేయించారు. కోర్ట్‌లో కేసు పెండింగ్‌లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది. వైయస్ఆర్‌సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్ మెగా డీఎస్సీపై వైయస్‌ఆర్‌సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరులక్షల మంది అభ్యర్ధుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్ట్‌ల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు. స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్‌లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్ లో ఎస్సీల్లో ఆర్‌ఓఆర్‌పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పోస్ట్‌ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ? ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16వేల పోస్ట్‌లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్ళలో ఉండే టీచర్ పోస్ట్‌లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా? జూన్ లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్‌ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్‌లకు కేబినెట్‌లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్‌లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ? అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీఓ మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్‌గా మారిపోతున్నాయి. ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్‌ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్‌నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్దులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ళ కింద పడిపోయే ప్రమాదం ఉంది. కేవలం 17 శాతం స్కూళ్ళను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్ళలో విద్యాబోధన కల్పించాలన్న వైయస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్ధుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది. ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా? చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లవ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్‌లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్‌లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్ లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. తాజా నోటిఫికేషన్‌లో వైయస్ జగన్ గారి అయిదేళ్ళ పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళ్ళ పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్‌లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు. వైయస్ జగన్ అయిదేళ్ళ కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు.1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు. 2018 డీఎస్సీ కింద వైయస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్‌లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్ లు ఇచ్చింది. 602 పోస్ట్‌లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్‌లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్‌ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేవలం పదివేల పోస్ట్‌లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్‌డే గిఫ్ట్‌లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైయస్ జగన్‌పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్దులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం.