మెడికల్‌ సీట్లు వదులుకోవడం అత్యంత హేయం

 మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం

ఏ రాష్ట్రం కూడా మెడికల్‌ సీట్లు అస్సలు వదులుకోదు

కానీ ఆ పని చేసిన ఏకైక చెత్త ప్రభుత్వ చంద్రబాబుది

ఏ ప్రభుత్వమూ ఇంత పనికిమాలిన నిర్ణయం తీసుకోదు

మెడికల్‌ సీట్లపై మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం

ప్రభుత్వ తీరుపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది

ప్రెస్‌మీట్‌లో సీదిరి అప్పలరాజు స్పష్టీకరణ

పలాస:  వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పులివెందుల మెడికల్‌ కాలేజీకి సంబంధించి మాట్లాడిన మాటలు విస్మయం కలిగించాయని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి ఎల్లో మీడియాలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావించారు. దేశచరిత్రలో ఇంత దారుణమైన ప్రకటన చేసిన ఆరోగ్యశాఖ మంత్రి ఏ రాష్ట్రంలో ఉండరన్న ఆయన, బ్రిటిషర్ల కాలంలో కూడా ఇంత చెత్త స్టేట్‌మెంట్‌ ఏ మంత్రి ఇచ్చి ఉండరని ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో  మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.

    ప్రభుత్వ రంగంలో అదనంగా మెడికల్‌ సీట్లు వద్దని ఏ రాష్ట్రమైనా అంటుందా? అని మాజీ మంత్రి సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని చెత్త పని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ బాధ్యత వైద్య విద్య ఎక్కువమందికి అందించేలా ఉండాలి కానీ.. మాకు మెడికల్‌ సీట్లు వద్దు.. మీరెందుకు ఇచ్చారని కేంద్రాన్ని ప్రశ్నించడం విడ్డూరమని అన్నారు.
    కాలేజీల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోమని కేంద్రం టైం ఇచ్చి, ఎల్‌వోపీ ఇచ్చి మీరు అండర్‌ టేకింగ్‌ లెటర్‌ ఇస్తే మేం సీట్లు ఇస్తామంటే.. మాకు సీట్లు వద్దన్న ఘనత చంద్రబాబు సర్కార్‌దని ఆక్షేపించారు. దీనిపై మేధావులు, విద్యావంతులు, విద్యార్ధి లోకం ఆలోచించాల్సిన అవసరం ఉందని, లక్షలాది తల్లిదండ్రులు కూడా దీనిపై స్పందించాలని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

Back to Top