తాడేపల్లిగూడెం: సింహాచల క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ దేవాదాయశాఖలో అవినీతి వల్లే నాసిరకం పనులతో భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో హిందూ ఆలయాలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేదని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... సింహాచలం దేవస్థానంలో స్వామివారి నిజరూపదర్శనం కోసం లక్షలాధి మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇటువంటి ప్రతిష్టాత్మక ఉత్సవం సందర్భంగా ప్రభుత్వపరంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. భక్తులకు సజావుగా దర్శనం లభించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ ఆలయాల పట్ల అత్యంత నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తోంది. భక్తుల భద్రత పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. సింహాచల ఆలయంలో మూడువందల రూపాయల టిక్కెట్లు తీసుకున్న భక్తులు మూడు రోజుల కిందట నిర్మించిన గోడ కూలి మీద పడటంతో ఏడుగురు చనిపోవడం అత్యంత బాధాకరం. గత ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా పిలిచిన టెండర్లను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి, అనర్హులకు అంచనాలను పెంచి పనులు అప్పగిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే సింహాచలంలో కూడా అవినీతి, నాసిరకం పనుల కారణంగా ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు ఎవ్వరూ లేరు. కేవలం స్వామివారి సేవకు వచ్చిన వాలంటీర్లు మాత్రమే ఉన్నారు. వారు మాత్రమే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ హయాంలో హిందూ ధర్మం పరిఢవిల్లింది గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, చాలా సంతోషంతో తృప్తిగా స్వామివారి దర్శనం జరిగేలా చూశాం. శ్రీశైల క్షేత్రంలో సాలమండపాలను భక్తుల వసతి కోసం ఆధునీకరించేందుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని సిద్దం చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే దానిని పక్కకకుపెట్టేసింది. ఉత్తర రాజగోపురం నిర్మించిన తరువాత దానిపైన కలశాలు పెట్టేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాకపోతే, దానిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆరు కేజీల బంగారంతో కలశాలను చేయించి, అత్యంత వైభవంగా ప్రతిష్టించాం. ఈ కార్యక్రమానికి కంచి, పుష్పగిరి, కాశీ పీఠాధిపతులు పాల్గొన్నారు. మహాకుంభాభిషేకం ను సంప్రదాయ సిద్దంగా నిర్వహించాం. 49 ఆలయాల్లో ఏకకాలంలో మహాకుంభాభిషేకం నిర్వహించాం. హిందూ ధార్మికవేత్తలు దీనిని ఎంతగానే ప్రశంసించారు. అలాగే 225 కోట్లతో దుర్గమ్మ ఆలయంలో భక్తులకు మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆలయంలోనూ మాసోత్సవాలను నిర్వహించాం. కూటమి పాలనలో హిందూధర్మంపై దాడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను సనాతన హిందూవాదిగా కొత్త అవతారం ఎత్తి హైందవ ధర్మ పరిరక్షణపై అనేక సార్లు మాట్లాడారు. సింహాచలం ఆలయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భక్తులు మృతి చెందితే ఆయన దీనిపై ఎందుకు స్పందించడం లేదు? ఇటువంటి నిర్లక్ష్యం జరుగుతున్నా పచ్చ మీడియాకు కనిపించడం లేదు. గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబు ప్రచార యావ కోసం 29 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నలబైకి పైగా హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ మంత్రి దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆలయాలను పగులకొట్టి, దేవతామూర్తుల విగ్రహాలను చెత్త ట్రాక్టర్‌లలో తరలించినా బీజేపీ మాట్లాడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మంపైనా, హిందూ ఆలయాలపైనా ఇదే తరహాలో దాడి జరుగుతోంది. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం కోసం వచ్చిన భక్తుల విషయలో కూడా ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనపై హిందూ ధర్మాన్ని కాపాడటానికే ఉన్నానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను క్షమాపణలు చెబుతున్నాను, టీటీడీ చైర్మన్, ఈఓలు కూడా క్షమాపణలు చెప్పాలంటూ దుర్ఘటనను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కనీసం డిప్యూటీ సీఎంను టీటీడీ చైర్మన్ పట్టించుకోకుండా క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ఎద్దేవా చేశారు. ఇలా ఉంది కూటమి పాలన. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం క్షేత్రంలో శ్రీమహావిష్ణు అవతారంగా పూజించే నక్షత్ర తాబేళ్ళు పోషణలో నిర్లక్ష్యం వల్ల పెద్ద సంఖ్యలో మృతి చెందాయి. వాటిని చెత్త కుప్పలో పడేసి తగులబెట్టారు. గత వైయస్ఆర్‌సీపీ పాలనలో వాటికి ఒక నెంబర్ ఇచ్చి, వాటి పోషణ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నాం. నేడు కూటమి ప్రభుత్వంలో నక్షత్ర తాబేళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వాటి దుస్థితి చూసి భక్తులు కంటతడి పెడుతున్నారు. తిరుపతి గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోమాతలు నిర్లక్ష్యం వల్ల చనిపోతే వాటిని వైయస్ఆర్‌సీపీ వెలుగులోకి తీసుకువచ్చింది. గోమాతల మరణాలపై టీటీడీ చైర్మన్ ఎంతో నిర్లక్ష్యంతో ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. తిరుమల పవిత్రన కాపాడతానంటూ ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ దీనిపై మాత్రం మాట్లాడరు. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే సినిమా ఫక్కీలో బయటకు వచ్చి పంచ్ డైలాగులు చెప్పడం, ఉద్రేకంతో ఊగిపోవడం చేస్తుంటారు. కడపజిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలను అటవీశాఖ అధికారులే కూల్చి వేస్తే, ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. కాశీనాయన క్షేత్ర పవిత్రనను పరిగణలోకి తీసుకుని, అటవీశాఖ పరిధిలోకి వచ్చే భూములను డీ నోటిఫై చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కానీ కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా, కిరాతకంగా భక్తులకు సేవలందించే సత్రాలను బుల్‌డోజర్లతో కూల్చివేశారు. ఆలయ సంప్రదాయాలపైనా గౌరవం లేదు సింహాచల చందనోత్సవంలో అనువంశిక ట్రస్టీ, తరువాత దేవాదాయశాఖ మంత్రి దర్శనం చేసుకుంటారు. టీటీడీ తరుఫున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఈ ఏడాది స్వామివారికి సాక్షాత్తు సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి పట్టువస్త్రాలను సమర్పిస్తారని ప్రకటించారు. కానీ సీఎం రాలేదు, కనీసం దేవాదాయశాఖ మంత్రి కూడా రాలేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఆలయ లాంఛనాలపైన కూడా కనీస గౌరవం, భక్తీ లేదని తేలిపోతోంది. భగవంతుడిని రాజకీయాలకు కూటమి ప్రభుత్వం వాడుకుంటోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని కూడా వారి స్వార్థానికి వాడుకునే దుర్మార్గమైన ప్రయత్నం చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో పంది, గొడ్డు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. దీనిపై నిరాధారమైన ఇటువంటి ఆరోపణలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్ట్ ఆక్షేపించింది. కృష్ణానది వరదల నుంచి డైవర్ట్ చేసేందుకు లడ్డూ కల్తీ అంటూ ఇష్టం వచ్చినట్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు. హిందూ ధర్మం గురించి పదేపదే మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. ఇదేనా ఆయన హిందూధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి. సింహాచల ఘటనపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి.