విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తదితరులతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతూ, ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారని తెలిసి కూడా దేవాదాయశాఖ భక్తుల భద్రతను గాలికి వదిలేసిందని ఆక్షేపించారు. నాసిరకం గోడ నిర్మాణం, దానిపై పెద్ద ఎత్తున భారం పడేలా వేసిన టెంట్లు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల డిమాండ్ మేరకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను, ప్రమాదంలో గాయపడి, విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తదితరులతో కలిసి పరామర్శించారు. అనంతరం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. గుడివాడ అమర్‌నాథ్ ఏం మాట్లాడారంటే..: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడం, ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామివారి చందనోత్సవం ఇక్కడ అత్యంత పవిత్రమైనది. సింహాచలంలో ఈ చందనోత్సవానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఏపీ, తెలంగాణ, ఒడిస్సా నుంచి తరలి వస్తుంటారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారు నిజరూప దర్శనం లభిస్తుంది. ఆ దర్శనం కోసం వచ్చి భక్తులు మరణించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం వల్లే ఈ ఘటన జరిగింది. ఏటా ఇదే సంఖ్యలో భక్తులు వస్తారనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని రోజుల క్రితమే గోడ నిర్మించారు. కనీసం క్యూరింగ్ లేకుండా, సాంకేతికంగా భద్రతా ప్రమాణాలను పాటించకుండా గోడ కట్టారు. ఏటా చందనోత్సవం రోజున దైవఘటనగా వర్షం కురుస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా దీని గురించి చెబుతారు. అలాంటిది హటాత్తుగా వర్షం కురిసింది, గాలి వీచింది అంటూ కూటమి ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. భక్తుల భద్రత పట్ల ఇంత ఉదాసీనతా?: భక్తులకు క్యూలైన్లు నిర్మించే క్రమంలో మూడు రోజుల కిందట నిర్మించిన గోడకు మేకులు కొట్టి, దానిని సపోర్ట్ గా తీసుకుని టెంట్లు వేశారు. బాధితులను పరామర్శించినప్పడు వారు చెప్పిన దాని ప్రకారం.. పెద్దగా వీచిన గాలికి కొత్తగా నిర్మించిన గోడ ఒక ఫ్లెక్స్ ఊగినట్లుగా ఊగింది, అదే క్రమంలో ఎక్కడా విద్యుత్ దీపాలు లేక చీకటిగా ఉంది. ఒక్కసారిగా గోడ కూలి మీదపడింది. ఆ గోడకు ఏర్పాటు చేసిన ఇనుక మేకులు, ఐరన్ సపోర్టర్‌లు కింద ఉన్న తమపై పడటంతో తీవ్రంగా గాయపడినట్లుగా క్షతగాత్రుల్లో ఒకరైన పైలా ప్రవీణ్ అనే యువకుడు వివరించారు. ఈ శిధిలాల కింద నలిగిపోయి ఏడుగురు చనిపోయారు. కనీసం క్యూరింగ్ చేయని గోడ ఏ రకంగా పటిష్టంగా నిలబడుతుందనే విషయం దేవాదాయశాఖ అధికారులకు తెలియదా? ఏదైనా సరే కొండప్రాంతాల్లో నిర్మాణాలు చేసే సందర్భంలో కాంక్రీట్‌తో రీటైనింగ్ వాల్ నిర్మిస్తూ ఉంటారు. దానికి బదులుగా ఫ్లైయాష్ బ్రిక్స్‌తో క్యూరింగ్ లేకుండా, మధ్యలో కాంక్రీట్ ఫ్లిల్లర్లు లేకుండా నామమాత్రంగా గోడను నిర్మించారు. దాని నాణ్యత అత్యంత నాసిరకంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా చూపిస్తున్నాం.(అంటూ ఆ ఫోటోలు చూపారు) ఈ ఫోటోల్లో చాలా స్పష్టంగా ఎంత దారుణంగా ఈ గోడ నిర్మాణం ఉంది, దీనిపైన ఏ రకంగా పెండాల్స్, సపోర్టర్స్‌ను వేసి దానిని మరింత బలహీనపరిచారో అర్ధం చేసుకోవచ్చు. సహజంగా గాలి వచ్చినప్పుడు పై నుంచి దానిపై భారం పడటంతో గోడ కూలిపోయి ఏడుగురు ఆ శిధిలాల కింద పడి చనిపోయారు. మూడు వందల రూపాయల క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తే, ప్రభుత్వం వారికి కనీస భద్రత కల్పించడంలో దారుణంగా విఫలైంది. ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారంటే వారిని ఎలా ఓదారుస్తారు?. బాధిత కుటుంబాలకు అండగా వైయస్‌ఆర్‌సీపీ: సింహాచలం దేవస్థానంలో చనిపోయిన ప్రతి బాధిత కుటుంబానికి, క్షతగాత్రులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది. చనిపోయిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి, ప్రభుత్వం నుంచి ఉద్యోగం కల్పించాలని బాధిత కుటుంబాలు చేస్తున్న డిమాండ్‌ను సమర్థిస్తున్నాం. ఎల్జీ పాలిమార్స్ ఘటనలో అప్పటి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాధిత కుటుంబాల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం.