హైదరాబాద్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొని, స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఏడుగురు గోడ కూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సింహాచలం దుర్ఘటనకు కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం మాట్లాడారంటే..: హిందువుల మనోభావాలకు విఘాతం: సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. దేవాలయాల సంరక్షణ, వాటి అభివృద్ధితో పాటు, హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. 2014–19 మధ్య కూడా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో అత్యంత దుర్మార్గంగా పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చడమే కాకుండా, ఆ దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లలో తరలించి హిందువుల మనోభావాలు గాయపర్చారు. ఇంకా గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. చంద్రబాబు సీఎం అయ్యాడంటే భక్తులు చనిపోవడం అనేది ఆనవాయితీగా మారింది. ప్రభుత్వ ఉదాసీనత. నాసిరకం పనులు: సింహాచలంలో చందనోత్సవానికి లక్షలాది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. తూతూమంత్రంగా నాసిరకంగా చేసిన పనుల కారణంగానే భక్తుల మరణాలు సంభవించాయి. చందనోత్సవం ఏర్పాట్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు ఎవరికెన్ని పాసులు పంచుకోవాలని వాదించుకోవడంతోనే సరిపోయింది. అంతే తప్ప, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయం వద్ద భక్తుల రద్దీ తట్టుకునే తగిన ఏర్పాట్లపై ఎవరూ చొరవ చూపలేదు.మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ అక్కడే ఉండి కూడా ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు. చివరకు టాయ్‌లెట్ సౌకర్యం కూడా కల్పించక పోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏదో అపరాచం: వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు సింహాచలం స్వామివారి దర్శనం కోసం వచ్చి, ఏడుగురు మృత్యువాత పడ్డారు. వరసగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, ఎక్కడో ఏదో అపచారం జరిగిందని మాత్రం అర్థమవుతుంది. పవన్‌కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు చేయాలి: నాడు ఎక్కడా జరగని అపచారానికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆర్భాటంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. హిందూ మతానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ను అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇప్పుడు సింహాచలం, గత జనవరిలో తిరుపతిలో జరిగిన దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా, ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆలయాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడాలి. తిరుమలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. చెప్పులేసుకుని దర్శనానికి వస్తున్నారు. బిర్యానీలు తింటున్నారు. టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. శ్రీకూర్మంలో విష్ణుమూర్తి రూపంగా భావించే నక్షత్ర తాబేళ్లు చనిపోతే చడీచప్పుడు కాకుండా కాల్చేశారు. పవన్‌కళ్యాణ్ ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా? భక్తులు చనిపోవడం, ఆలయాల్లో అపచారాలు చేయడమేనా మీ ఉద్దేశం?. శిక్షించలేనప్పుడు కమిటీలెందుకు?: తిరుపతిలో తొక్కిసలాటపై దర్యాప్తునకు కమిటీ వేసిన ప్రభుత్వం ఏం తేల్చింది? తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మళ్లీ త్రిసభ్య కమిటీ వేశామంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించలేనప్పుడు కమిటీలు వేసి ఏం ప్రయోజనం? ఆలయాల్లో వరుసగా భక్తులు చనిపోతుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదా?. బాధిత కుటుంబాలకు ఏదో పరిహారం ఇచ్చి, క్షతగాత్రులకు వైద్యం చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం సరికాదని, భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడటం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు.