తిరుపతి: దళారీ వ్యవస్థ లేకుండా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసేందుకు ఆనాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆప్కాస్‌ను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం చేశారు. తిరుపతిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తనకు అనుకూలమైన ఏజెన్సీలకు దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. చిరుద్యోగుల పొట్టకొట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే... 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందాలంటే లంచాలివ్వాల్సి వచ్చేది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఐదారు నెలలకోసారి జీతాలిచ్చేవారు. ప్రతినెలా వచ్చే జీతంలోనూ కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. కష్టపడి పనిచేస్తున్నా జీతభత్యాల విషయంలో నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యల నుంచి వారిని బయటపడేసేలా నాటి సీఎం వైయస్ జగన్ 2019 డిసెంబర్ 19న ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు (ఆప్కాస్) చేసి జూలై 3, 2020న ప్రారంభించారు. అదేరోజున 47 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోతల్లేకుండా ప్రతినెలా ఒకటో తేదీనే చెల్లింపులు జరిగేవి. ఈఎస్ ఐ, ఈపీఎఫ్ జమ చేయడం జరిగేది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వేతనాలు పొందేవారు. ఈ ఉద్యోగుల్లో 50 శాతం మంది మహిళలతోపాటు ఎస్సీఎస్టీ బీసీ ఉద్యోగుల నియామకం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకిచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ఉద్యోగుల పొట్టకొట్టే దిశగా నిర్ణయాలు ఉద్యోగులు ఊహించని విధంగా నిన్న ప్రభుత్వం జీవో 802 ను విడుదల చేయడం జరిగింది. ఎన్నికల్లో హామీలు నెరవేర్చకపోగా ఉద్యోగుల పొట్టకొట్టే విధంగా ఆప్కాస్‌ను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థను సమీక్షించడానికి మంత్రులు నారాయణ, లోకేష్, పయ్యావుల కేశవ్‌ల తో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్లుగా ఉద్యోగులకు పారదర్శకంగా ఒకటో తేదీన ఎలాంటి కటింగ్ లు లేకుండా జీతాలిచ్చిన వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? ఉద్యోగులకు మంచి చేస్తున్న వ్యవస్థను రద్దు చేసి దళారీల రూపంలో ఉన్న తెలుగుదేశం నాయకుల జేబులు నింపడానికే ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించకుండా పక్కనపెట్టేసింది. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 10,177 మందిని గుర్తించి అందులో 3 వేల మందికిపైగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉండిపోయిన మిగిలిన వారికి కూటమి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ప్రభుత్వం తక్షణం జీవో నెంబర్ 802ని రద్దు చేయాలి. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆప్కాస్ ను కొనసాగించాలి. దళారీ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగుల పొట్ట కొట్టొద్దని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.