తిరుపతి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను అవతవరించినట్టు ప్రచారం చేసుకునే చంద్రబాబు, సరిగ్గా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే విషపు నాగులాగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశాడు. కుప్పం మున్సిపాలిటీలో కేవలం ఆరుగురు కౌన్సిలర్లే ఉన్న టీడీపీ, చైర్మన్ ఎన్నికల్లో 15 మంది సభ్యుల బలంతో చైర్మన్ పీఠాన్ని కైసవం చేసుకోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. ఏడాది పదవీ కాలం కూడా లేని చైర్మన్ పీఠం కోసంవైయస్ఆర్‌సీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 9 మంది కౌన్సిలర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు ఎరవేసి అధికార మదం ప్రదర్శించారు. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే మార్పులేవీ ఉండవని తెలిసి కూడా ఇలాంటి అనైతిక విధానాలకు పాల్పడుతున్న చంద్రబాబును చూసి ప్రజాస్వామ్యవాదులు ఆలోచనలో పడ్డారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకునేందుకు కూటమి నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. తిరుపతి, విశాఖ మేయర్ ఎన్నికల్లో గెలవడం కోసం కూటమి నాయకులు చేసిన విధ్వంసాన్ని రాష్ట్రమంతా చూసి నివ్వెరపోయింది. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి, ఎంతకైనా దిగజారడానికి తాము సిద్ధమన్నట్టు కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో ఒక్కసీటుతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం కాబట్టే టీడీపీ అభ్యర్థి చైర్మన్ కాగలిగారు. ఆనాడే మా నాయకులు వైయస్ జగన్ ఆదేశించి ఉంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి చైర్మన్ కాగలిగేవారేనా? ప్రజాస్వామ్య విలువలు కాపాడేలా గడిచిన ఐదేళ్లు వైయస్ఆర్‌సీపీ పాలన సాగితే, చంద్రబాబు సారథ్యంలో కూటమి పాలన వచ్చాక అడుగడుగునా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుతున్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులకు విలువ లేకుండా అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం చూసి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలంతా చంద్రబాబు పాపపు పాలన చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదు.