అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే

వరద మరణాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

విజయవాడ వరదలు ఏ మాత్రం ప్రకృతి వైపరీత్యం కాదు

అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం. సీఎం పబ్లిసిటీ యావ

వరదలపై సమాచారమున్నా ప్రజలను అలర్ట్‌ చేయలేదు

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారివి  ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, మరోవైపు వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆక్షేపించారు. విజయవాడ వరదలు ఏ మాత్రం ప్రకృతి వైపరీత్యం కాదన్న మాజీ మంత్రి, అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం అని, సీఎం పబ్లిసిటీ యావకు పరాకాష్ట అని అభివర్ణించారు. అందుకే వరద మరణాలకు సీఎం, మంత్రివర్గంతో సహా, సంబంధిత శాఖల అధికారులంతా బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

    బుడమేరు వరదపై నీటి పారుదల శాఖ డీఈ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌పీ సిసోడియా.. భిన్న ప్రకటనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. విజయవాడలో వందలాది ఫంక్షన్‌ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నా, బాధితులను ఎందుకు తరలించలేక పోయారని ప్రశ్నించారు.
    వరద ముంచెత్తినప్పటి నుంచి రోజూ ఒక్కో విధంగా మందీ మార్బలంతో అట్టహాసంగా పర్యటిస్తూ.. పగలు, రాత్రి తేడా లేకుండా మీడియాతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, ఆ వరదలపై స్పష్టంగా ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను ఎందుకు అలర్ట్‌ చేయలేదన్న దానిపై సమాధానాన్ని దాటేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి విపత్తులను పబ్లిసిటీకి వాడుకోవడానికే తప్ప, ప్రజలను ఆపద నుంచి గట్టెక్కించాలన్న ఆలోచన సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం లేదని ఆక్షేపించారు.
    గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో శబరి, గోదావరి నదులకు భారీ వరదలు వచ్చినప్పుడు సుమారు 250 ఏజెన్సీ గ్రామాలకు చెందిన 18 వేల కుటుంబాలను 102 పునరావాస కేంద్రాలకు తరలించామని మాజీ మంత్రి గుర్తు చేశారు. కనీస రహదారి లేని చోట్ల లాంచీలు ఏర్పాటు చేసి, అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, అన్ని రకాలుగా అండగా నిలబడ్డంతో పాటు, ఒక్క  ప్రాణనష్టం కూడా జరక్కుండా బాధ్యత తీసుకున్నామని వెల్లడించారు. 
    అలాంటిది విజయవాడ నడిబొడ్డున వరదలు వస్తే, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 45 మందికి పైగా చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం, ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడం కోసం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని దుయ్యబట్టారు. ఆ దిశలోనే ప్రతి అంశాన్ని తమ పార్టీకి అన్వయిస్తున్నారని ఆక్షేపించారు. 
    తమ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌గారు, కృష్ణా రీటెయినింగ్‌ వాల్‌ నిర్మించక పోయి ఉంటే, కృష్ణలంకతో సహా, నగరంలో ఇంకా ఎలాంటి విపత్తు జరిగి ఉండేదో, విజయవాడ వాసులు ఆలోచించాలని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా చేసిన తప్పిదాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, బాధితులను ఆదుకోవాలని మాజీ మంత్రి కోరారు.

Back to Top