గుంటూరు: రాష్ట్రంలో లోకల్ ఎమ్మెల్యే(ఎల్ఎం) ట్యాక్స్ అమలు చేస్తున్నారని మాజీమంత్రి, గుంటూరుజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అవినీతి, దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని విమర్శించారు. కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ సినిమాటిక్ హైడ్రామా ఆడారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కూటమి ఎమ్మెల్యేలు అక్రమ ధనార్జన కోసం బహిరంగ కొట్లాటలకు తెగబడుతుంటే, వారిని కట్టడి చేయాల్సిన సీఎం చంద్రబాబు వారి మధ్య వాటాల పంపకం కోసం సెటిల్ మెంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. కడపజిల్లాలో కూటమి ఎమ్మెల్యేల మధ్య బూడిద కోసం బజారునపడి కొట్లాటకు దిగితే, దానికి సీఎం సంధానకర్తగా బూడిద పంచాయతీ చేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు. గాలి, నీరు, భూమి ఇలా పంచభూతాలను సైతం దోచుకోవడమే తమ పని అన్నట్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల ధనదాహం కూటమి ఎమ్మెల్యేలు ధనదాహంతో నియోజకర్గాల్లో బలవంతపు వసూళ్ళు, వాటాల కోసం తెగబడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న సీఎం చంద్రబాబు వారి మధ్య సయోధ్య కుదుర్చుతూ, వాటాలు పంచే పనిలో నిమగ్నమయ్యారు. ఇసుక, మద్యం, ప్రైవేటు కాంట్రాక్ట్ లు ఇలా ఎక్కడ చూసినా తమ వాటాల కోసం కూటమి ఎమ్మెల్యేలు నడివీధుల్లో కొట్టుకుంటున్నారు. ఆదిపత్య పోరుతో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకునే ధైర్యం చేయడం లేదు. సీఎం చంద్రబాబు బూడిద పంచాయతీ కడపజిల్లాలో బూడిద కోసం కూటమి ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు బహిరంగంగా పోట్లాటకు దిగారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తూ, ప్రజలన భయబ్రాంతులకు గురి చేశారు. ఒకరిపై మరొకరు సవాళ్ళు విసురుకున్నారు. బూడిద రగడ ముదరడంతో సెటిల్మెంట్ బాబు రంగంలోకి దిగారు. ఏకంగా పంచాయతీ పెట్టి బూడిద సొమ్ములో వాటాలు తేల్చే పనిలోకి దిగారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పంచాయతీకి గైర్హాజరు అయ్యి మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చంద్రబాబుకే సంకేతాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపడటానికి ఉన్నారా? సెటిల్ మెంట్ బ్యాచ్ లతో పంచాయతీలు చేయడానికి ఉన్నారా? రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం దౌర్జన్యాలు రాష్ట్రంలో నాణ్యమైన, చౌకధరతో కూడిన మద్యాన్ని ప్రజలకు అందిస్తానని చంద్రబాబు హామీలు గుప్పించాడు. నేడు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం చేతుల్లోనే మద్యం దుకాణాలు ఉన్నాయి. లాటరీల పేరుతో మద్యం దుకాణాల కేటాయింపు చేసినా, తమకు దుకాణాలు ఇవ్వాల్సిందేనని, అందులో భారీగా వాటాలు పంచాల్సిందేనంటూ కూటమి ఎమ్మెల్యేలు బెదిరించి మరీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నర్సారావుపేట వంటి చోట్ల ఏకంగా బార్లపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసే పరిస్థితిని చూశాం. తాడిపర్తి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా తనకు ముప్పై శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని వీడియో కెమేరాల సాక్షిగా హెచ్చరికలు జారీ చేశారు. లిక్కర్ సిండికేట్ల కోసం కోట్లు పెట్టానని మరో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆడియోల సాక్షిగా దొరికిపోయాడు. కృష్ణాజిల్లా ఉయ్యూరు, గన్నవరం, పెడన నియోజకవర్గాల్లో అసలు లిక్కర్ వ్యాపారులే అడుగు పెట్టలేకపోయారు. బాపట్ల జిల్లా కొల్లూరులో మద్యం షాప్ కోసం జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు దాడులు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యందుకాణాల కోసం జరిగిన దందాలు అన్నీఇన్నీ కావు. ఉచిత ఇసుక విధానం ముసుగులో మరోసారి దోపిడీ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ముసుగులో మరోసారి దోపిడీకి కూటమి ప్రభుత్వం తెగబడింది. ఎక్కడైనా ప్రజలకు ఉచితంగా ఇసుక లభిస్తోందా? రాష్ట్రంలోని అన్ని రీచ్ ల్లోనూ కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలే పాగా వేశారు. తవ్వకాలు, రవాణా పేరుతో పెద్ద ఎత్తున ఇసుక ఎక్కువ రేట్లతో విక్రయిస్తున్నారు. వీరు ఎంత రేటు చెబితే అంతకు వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. వైయస్ఆర్ సిపి హయాంలో కన్నా ఇప్పుడు ఎక్కువ రేటుకే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. కాకినాడలో పవన్ కళ్యాణ్ హైడ్రామా కాకినాడ యాంకర్ పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ ఫక్కీలో హైడ్రామా చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమరవాణా అంటూ చేసిన హంగామా ఆశ్చర్యం కలిగిస్తోంది. స్థానిక ఎస్పీ, సివిల్ సప్లయిస్ అధికారులు తనను లెక్క చేయలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతుంది చూస్తుంటే, ఆయన తన అసమర్థతను తానే ఒప్పుకున్నట్లుగా కనిపిస్తోంది. మీకు సహకరించకూడదని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు చెప్పారా? జనసేన పార్టీకి చెందిన మనోహర్ సివిల్ సప్లయిస్ మంత్రిగా ఉన్నారు. అయినా కూడా ఆ శాఖ అధికారులు తమను పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ చెబుతుంటే ఎలా అర్థం చేసుకోవాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది. కాకినాడ పోర్ట్ ద్వారా పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని గతంలోనే పవన్ కళ్యాణ్ ఆరోపణల చేశారు. దాదాపు 47 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నామని సివిల్ సప్లయిస్ మంత్రి ప్రకటించారు. మరి ఈ బియ్యం ఏమయ్యింది? ఈ అక్రమ రవాణాపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ రాజీనామా చేయాలి రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ రాజీనామా చేయాలి. రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం రవాణా మాఫియాకు కూటమి ఎమ్మెల్యేలే నాయకత్వం వహిస్తున్నారు. కాకినాడ నుంచి జరిగే అక్రమ రవాణా స్థానిక ఎమ్మెల్యే కొండబాబు, మంత్రి మనోహర్ కు తెలియకుండానే జరుగుతోందా? పర్సంటేజీలు తీసుకుని బియ్యాన్ని వదిలేస్తున్నారు. రెండు చెక్ పోస్ట్ లు దాటి పీడీఎస్ బియ్యం పోర్ట్ లోకి ఎలా వెడుతోంది? పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత పర్సంటేజీలు పెరిగాయి పీడిఎస్ బియ్యం తనిఖీల పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హడావుడి చేసిన తరువాత ఈ బియ్యాన్ని తరించే వారి నుంచి వసూలు చేసే పర్సంటేజీలు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టబద్దంగా బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించే వ్యాపారులను కూడా బెదిరించి మరీ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. కమీషన్లు ఇవ్వకపోతే పీడీఎస్ బియ్యం ఉందని కేసులు నమోదు చేస్తామని బెదరిస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబుతుంటే, కూటమి ఎమ్మెల్యేలు తమ సంపదనను పోగు చేసుకునే పనిలో ఉన్నారు.