అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను రోడ్డున పడేశారని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, తుపాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వైయస్ జగన్ ఎండగట్టారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు రూ.300– రూ.400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు రూ.1725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్లపైనే ధాన్యం...కొనేవారేరీ...!? ధాన్యం కొనే వారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుఫాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. యుద్ద ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణ, గోదావరి, డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్ది ధాన్యం రాసులు రోడ్లపైనే కన్పిస్తున్నాయి. విజయవాడ – మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవునా ఆరబెట్టిన ధాన్యం కొనేనాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా? కనీస సాయం అందించిన పాపాన పోలేదు వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచనకూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈ క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన,రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారి పోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌తో నువ్వు, మీ మంత్రులు కాలం గడుపుతున్నారు. మా హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర కల్పించాం. అంతే కాదు గన్నీ సంచులు, లేబర్, రవాణా (జీఎల్‌టీ) చార్జీలను ప్రభుత్వమే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌లోని టోల్ ఫ్రీ నెంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుఫాను సమయంలో రైతులను ఆదుకునేందుకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నాడు ప్రతీ జిల్లాకు రూ.కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చూశాం. రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నాం.. తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మిల్లర్ల దోపిడిని అరికట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించాం. క్షేత్ర స్థాయిలో ఆర్బీకే సిబ్బంది రైతు క్షేత్రాల వద్దకు వెళ్లి, జియోట్యాగింగ్ ద్వారా ఫోటోలు తీసి, నాణ్యతను పరిశీలించడం, ఆన్‌లైన్‌లోనే రైతుల వివరాలను నమోదు చేసి ట్రక్ షీట్ జనరేట్ చేశాం. ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమెటిక్‌గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చాం. ధాన్యం లోడులు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను అమర్చాం. మిల్లుల్లో రైతులతో సంబంధం లేకుండా ధాన్యం నాణ్యత సమస్యలను పరిష్కరించాం. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతీ మిల్లుకో కస్టోడియన్ అధికారిగా నియమించాం. మండలానికో ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించాం. వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రతీ జిల్లాకో మొబైల్ మినీ మిల్లును ఏర్పాటు చేశాం. రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే ఇవన్నీ చేశాం. మా హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దతు ధర దక్కలేదని రోడ్డుమీదకు రాలేదు. 2014–19 మధ్య మీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2019–24 మధ్య మా హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. రైతులకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడ? అధికారంలోకి వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు ? సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించు కుంటుంది ? సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు నానా అగచాట్లు పడ్డారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేరు. ఆర్బీకేలు నీరుగారిపోయాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సున్నావడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారు. రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచితపంటల బీమాపథకాన్ని ఎత్తి వేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారు. 2023–24 సీజన్‌లో రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు జూన్‌లో కట్టాల్సి ఉండగా, నువ్వు ఎగ్గొట్టడం వలన రైతులకు రూ.1385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. పెట్టుబడి సాయం లేక,రుణాలు అందక రూ.3లు, రూ.5లు వడ్డీలకు అప్పులు చేసి మరీ రైతులు సాగు చేశారు. అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యం, మొండి చేయి ప్రదర్శించినా, వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన రైతులు నీ నిర్వాకం వలన తీవ్రంగా నష్టపోతున్నారని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.