నరసరావుపేట: సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫిలాసఫీగా భావించారు.. అందుకే బడుగు, బలహీనవర్గాలకు ఎన్నో పదవులు ఇచ్చారు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మూడోరోజు బస్సు యాత్ర నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. దేశంలో ఆనాటి వ్యవస్థలో శూద్రులకు ఎక్కడా ఆదరణ దక్కలేదని, వివిధ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి సమాజంలో గౌరవం కూడా ఉండేది కాదని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆ వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. కానీ, సీఎం వైయస్ జగన్ సామాజిక న్యాయాన్ని ఫిలాసఫీగా భావించడం వల్లనే మంత్రివర్గంలో 70 శాతం ఆ వర్గాలకు ఇచ్చారని గుర్తుచేశారు. అన్ని పదవుల్లోనూ వారికి తగిన ప్రాతినిథ్యం కల్పించారన్నారు. ఇతరులకు అధికారం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని, ఎంతో విశాల భావం ఉంటే తప్ప, అది సాధ్యం కాదన్నారు. ``అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. దీన్ని గమనించిన సీఎం వైయస్ జగన్, ఆ దిశలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి, పిల్లలకు విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నారు. ఆ విధంగా ఇన్నేళ్లు ఆ వర్గాలకు జరిగిన అన్యాయాన్నిసీఎం వైయస్ జగన్ ఇప్పుడు సరిదిద్దుతున్నారు. దాదాపు రూ.1.40 లక్షల కోట్లు నేరుగా నిరుపేదలకు బదిలీ చేశారు. దీంట్లో ఎక్కడా అవినీతి, అక్రమాలు, వివక్షకు తావు లేకుండా చూశారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. నిరుపేద కుటుంబాలకు 9 నెలల పాటు ఉచితంగా బియ్యం, పప్పులు, నూనె వంటి సరుకులు అందించారు. బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. పేదలను ఆదుకుంటూ, అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైయస్ జగన్‌ను దింపడానికి ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తుంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలి. ఆ ప్రయత్నాలు ఆపాలి. లేకపోతే బడుగు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఎవ్వరూ రారు. కాబట్టి అది అందరి బాధ్యత. మనందరి కోసం పని చేస్తున్న సీఎంకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. పేదలకు సీఎం వైయస్ జగన్ డబ్బు పంచుతున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అంతే చంద్రబాబు అధికారంలోకి వస్తే అవేవీ ఇవ్వడనే కదా అర్ధం. కాబట్టి దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా మీ వల్లే ఏర్పాటు అవుతుంది.``