రాజమండ్రి: రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదని, ఆయన ట్వీట్లు హాస్యాస్పదమన్నారు. డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పౌరహక్కులను కాపాడుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. అందరికీ విద్య అందుబాటులోకి తీసుకురావాలని జగనన్న అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం బోధన, ప్రజల హక్కులను కాపాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఇవన్నీ తట్టుకోలేక కొందరు రకరకాల దుష్ప్రచారాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పాట్నర్ పవన్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే రాజ్యాంగ స్ఫూర్తి గురించి ట్వీట్ చేశారు. మన కంటే నాలుగు గంటలు ముందుండే తూర్పు దేశాల కాలమానం ప్రకారం ట్వీట్లు విడుదలయ్యాయి. దీన్ని బట్టి వీరికి దేశం మీద, ఇక్కడి పరిస్థితులపై ఏ విధమైన అవగాహన ఉందో అర్థం అవుతుంది. అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలని, ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే నాయకుడు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చివరకు ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయి ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేశాడు. ఇన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచి రాజ్యాంగ స్ఫూర్తి గురించి ట్వీట్లు చేయడం హాస్యాస్పదం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలను సఫలం చేయడం కోసం సీఎం వైయస్ జగన్ అహర్నిశలు కష్టపడుతుంటే చంద్రబాబు కేవలం బురదజల్లే కార్యక్రమంతో రాజకీయాలు చేస్తున్నాడు. అబద్ధాలను నిజాలుగా నమ్మించాలని, నిజాలను తప్పులుగా భ్రమింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యాంగ స్ఫూర్తిగురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా..? 2014–19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి ముగ్గురు ఎంపీలను లాక్కున్నాడు. ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం పట్ల గౌరవం, ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ ఉంటే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరినప్పుడు వారిపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ఎందుకు లేఖ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాంగం గురించి చంద్రబాబు నీతులు వల్లించడం తగదు. రాజకీయాల్లో విలువలు లేకుండా చేసిన నాయకుడు ఎవరు అని దేశంలో ఎవరిని అడిగినా చంద్రబాబు అనే చెబుతారు. అలాంటి వ్యక్తి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. బాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఈ రోజు ఓటుకు కోట్ల కేసు వరకు ఏది రాజ్యాంగబద్ధం చేశారని ప్రశ్నిస్తున్నాం. విలువ లేని నాయకుడు చంద్రబాబు. ఐదేళ్లు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సక్రమంగా నిర్వహించలేకపోయాడు. కేబినెట్‌లో ఎస్టీ, మైనార్టీ మంత్రి లేని పరిస్థితిని నెలకొల్పారు. సీఎం వైయస్ జగన్ చేపట్టిన ప్రతీ పథకం రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులను కాపాడేలా ఉన్నాయి. అణగారిన వర్గాలను ఆదుకుకోవడం మొదలుకొని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం పనుల్లో, పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రతీ అంశంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా ముందుకువెళ్తున్నారు. ఆర్టికల్ 21 కింద రైటు ఎడ్యుకేషన్ ఉంది. దాని ప్రకారమే పాఠశాలలను బలోపేతం చేయడం, ఇంగ్లిష్ మీడియం బోధన తీసుకువచ్చారు. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడం కోసం మూడు నెలల పాలనలోనే 1.40 లక్షల ఉద్యోగాలు కల్పించారు. రాజ్యాంగంలోని నాల్గవ విభాగంలో డైరెక్టీవ్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ ప్రకారం ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ఆర్టికల్ 40 ప్రకారం మద్య నిషేధం దిశగా అడుగులు. ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ సామాజిక దోపిడీ, అన్యాయాలను అరికట్టేందుకు చట్టాలు తీసుకువచ్చారు. ఆర్టికల్ 47 ప్రకారం మద్య, మాదకద్రవ్యాలను నిషేధించాలని ముందుకు వెళ్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సంక్షేమాలను చేపడుతుంటే ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంగా ఉండేందుకు కూడా చంద్రబాబు పనికిరాడని ప్రజలు భావిస్తున్నారని మంత్రి కన్నబాబు వివరించారు. Read Also: లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి