అమరావతి: 2025- 2026 బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మహిళలకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు. గత బడ్జెట్‌లో కూడా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. నమ్మి ఓట్లు వేస్తే ఇంత దారుణంగా మోసం చేస్తారా అని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ కంటే డబుల్ ఇస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. మహిళా శక్తికి నిధులు కేటాయించామని హోం మంత్రి అనిత గత బడ్జెట్‌లోనే చెప్పారు. నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవని, ఉచిత బస్సు ఊసే లేదని దుయ్యబట్టారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించారని తప్పుపట్టారు. వైయస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి డబ్బులు అందేవని, రైతు భరోసా సాయం చేసేవారన్నారు. ఈ బడ్జెట్‌లో రైతు భరోసాకు కంటి తుడుపు చర్యగా నిధులు కేటాయించారని విమర్శించారు. దీపం పథకాన్ని 90 లక్షల మందికే కుదించారు. సున్నా వడ్డీకి నిధులే లేవన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇవి ఏమాత్రం సరిపోవన్నారు. ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడీగానే కనిపిస్తుందని వరుదు కళ్యాణి అభివర్ణించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని, మంత్రి లోకేష్‌ను పొగడటానికే శ్రద్ధ చూపారని, పవన్ కోపడుతారని ఓసారి ఆయన పేరు ప్రస్తావించారని తెలిపారు. ఈ బడ్జెట్‌తో రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఏరు దాటాక తెప్ప తగిలేశారని మరోసారి తేటతెల్లమైందని వరుదు కళ్యాణి విమర్శించారు.