అసెంబ్లీ మీడియా పాయింట్: కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు. బుధవారం శాసన మండలిలో ఆడబిడ్డ నిధిపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, మంగమ్మలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకానికి లాస్ట్ బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఈ పథకానికి కోటి 50 లక్షల మంది అర్హులు ఉన్నారని చెప్పారు. సంవత్సరానికి రూ.32 వేల కోట్లు అవసరం అవుతాయని,అయితే బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళ పక్షపాతిగా గత ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశారని ఆమె గుర్తు చేశారు. వైయస్ఆర్ చేయూత, కాపునేస్తం, ఆసరా వంటి పథకాలు ప్రవేశ పెట్టి అడబిడ్డలను ఆదుకున్న ఘనత వైయస్ జగన్‌దే అన్నారు. ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించకుండా చంద్రబాబు మహిళ ద్రోహిగా నిలిచారని వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు.