143 హామీలిచ్చి మోసం చేసిన ఘ‌నుడు చంద్ర‌బాబు

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్ 

వైయ‌స్ఆర్ జిల్లా:  ఎన్నిక‌ల స‌మ‌యంలో సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘ‌నుడు చంద్ర‌బాబు అంటూ వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిప‌డ్డారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా పెన్షన్ 4000 రూపాయలు పెంచడం తప్ప ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌లేద‌న్నారు. 10 లక్షల పెన్షన్లను తొలగించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల పెన్షన్లను తొలగించాలని కుట్ర చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉద్యోగస్తులకు కూడా కూటమి ప్రభుత్వం నెల 1వ తేదీన‌ జీతాలు ఇవ్వడం లేద‌న్నారు. ఈ ప్ర‌భుత్వం 9 నెల‌ల్లో చేసిన రూ.1.34 ల‌క్షల కోట్ల అప్పులు దేనికి ఉపయోగించారో శ్వేతపత్రం విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గతంలో వైయ‌స్ జ‌గ‌న్  న‌వ‌ర‌త్నాలు, వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిదారుల‌కు డీబీటీ ద్వారా నేరుగా అందించార‌ని గుర్తు చేశారు.  పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన వ్యక్తి వైయ‌స్ జ‌గ‌న్ అయితే..వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతి పరులకు ఎటువంటి పనులు చేయకూడదు అని బహిరంగంగానే చంద్రబాబు ప్రకటించడం దారుణ‌మ‌న్నారు.  ప్రజలు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకొని నిలదీసే రోజు త్వరలోనే వస్తుంద‌ని ర‌వీంద్రనాథ్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top