తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మోసం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, 143 హామీల కోసం రెండు బడ్జెట్లలో అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోందన్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారని, చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు ఎగ్గొట్టేందుకు ఇప్పుడు తప్పుడు ప్రచారం, అబద్ధాలు చేస్తున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ: – చంద్రబాబు ఇప్పటికి రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వాటిని గమనిస్తే, కనిపించేది ఏమిటంటే, చంద్రబాబుగారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. – ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ. భవిష్యత్ గ్యారెంటీ. ఎన్నికల తర్వాత అది బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అని స్పష్టం అవుతుంది. – ‘పరనింద. ఆత్మస్తుతి’. గవర్నర్ ప్రసంగంతో పాటు, బడ్జెట్‌లోనూ అదే ఎంతసేపూ జగన్‌పాలన మీదే విమర్శలు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయం ఏమిటన్నది మాత్రం చెప్పరు. – సూపర్‌సిక్స్, మేనిఫెస్టోలో 143 హామీల గురించి అడిగితే సమాధానం రాదు. ఏది చెప్పినా అబద్ధం. ఏది చెప్పినా మోసం. ప్రధాన హామీలు. సూపర్ సిక్స్‌లో చూస్తే..: – యువతకు ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన హామీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకు అది ఇస్తామన్నారు. – కానీ, గత ఏడాది బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదు. అందుకోసం రూ.7200 కోట్లు కావాలి. 20 లక్షల యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వడానికి ఆ మొత్తం కావాలి. కానీ, ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. – కానీ, గవర్నర్ ప్రసంగం కాపీ తెలుగులో చూస్తే, ఈ 9 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపారు. ప్రింట్ చేసి మరీ, గవర్నర్ ప్రసంగంలో చూపారు. చెప్పారు. (అంటూ.. గవర్నర్ ప్రసంగం కాపీ చూపారు. అందులో ఏం రాశారనేది చదివి వినిపించారు.) – ఇది గవర్నర్ ప్రసంగంలో పెట్టిర మ్యాటర్. అంతటితో వారి మోసం ఆగిపోలేదు. ఉద్యోగాలపైనా పచ్చి అబద్ధాలు: బడ్జెట్ సందర్భంగా 2014–25 రెండవ సామాజిక ఆర్థి సర్వేలో కూడా ఏం చెప్పారంటే.. – ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 2024–25కి సంబంధించి 27,07,752 ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. – ఎంత దారుణ మోసం. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఏకంగా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పడం పచ్చి మోసం. – ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు గత ఏడాది రూ.36 వేలు ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అంటే ప్రతి పిల్లాడికి ఇప్పటికే రూ.72 వేలు బకాయి. అంత మోసం. దగా. వంచన. – ఇటు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతిలేదు. మరోవైపు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం. ఉద్యోగాలు: – 2019 జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తే, అక్టోబరు 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.36 లక్షల ఉద్యోగాలు, మరో 2.66 లక్షల వాలంటీర్లు, ఆప్కాస్ ద్వారా మరో 96 వేల ఉద్యోగాలు ఇచ్చాం. – ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. – 5 ఏళ్లలో మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ చూస్తే.. 6,31,310 – లార్జ్ అండ్ మెగా సెక్టార్‌లో కల్సించిన ఉద్యోగాలు చూస్తే.. 1.02 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 32,79,970 ఉద్యోగావకాశాలు కల్పించాం. – అలా ఆ 5 ఏళ్లలో మేము ఇచ్చిన, కల్పించిన మొత్తం ఉద్యోగాలు చూస్తే.. 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. అదీ మా చిత్తశుద్ధి. కానీ ఈ ప్రభుత్వం!: – ఇది సామాజిక ఆర్థిక సర్వేలోనే ఉంది. అప్పటి సర్వేలో ఈ వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగాల కల్పనలో ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం. – వీరు (ఈ ప్రభుత్వం) ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగావకాశాలు కల్పించకపోగా, పారిశ్రామికవేత్తలను బెదిరించి పంపేస్తున్నారు. – కడపలో జిందాల్ స్టీల్ కంపెనీని వెళ్లగొట్టారు. అరబిందోను కూడా పంపిస్తున్నారు. – ఈ రెండు బడ్జెట్లలో కలిపి ప్రతి నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన మరో హామీ. ఆడబిడ్డ నిధి. శూన్యం: – 18 నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్నారు. – మొన్న 2.07 మంది మహిళా ఓటర్లలో 60 ఏళ్లు నిండిన వారిని తీసేస్తే.. 1.80 కోట్ల మంది మిగులుతారు. వారికి ఏటా రూ.18 వేల చొప్పున ఇవ్వడానికి రూ.32,400 కోట్లు కావాలి. – కానీ, ఈ బడ్జెట్‌లో మీరు కేటాయించింది సున్నా. అంటే రెండేళ్లకు కలిపి చంద్రబాబు ప్రతి మహిళకు రూ.36 వేల బాకీ. ఉచిత బస్సు. లేదు: – మహిళలకు ఉచిత బస్సు. ఏడాదికి మహా అయితే రూ.3500 కోట్లు అవుతుంది. గత ఏడాది అమలు లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ప్రస్తావించలేదు. – మా రాయలసీమ మహిళలు విశాఖ చూడాలని ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర నుంచి అందరూ విజయవాడ, అమరావతి చూడాలనుకుంటున్నారు. – కానీ, ఇలాంటి చిన్న హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబుగారు తన నైజం చూపుతున్నారు. ఈ రెండేళ్లలో మహిళలకు ఉచిత బస్సు అమలు చేయకుండా రూ.7 వేలు బకాయి పడ్డారు. తల్లికి వందనం. పచ్చి మోసం: – స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికి ఇస్తామంటూ తల్లికి వందనం అని ప్రకటించారు. గొప్పగా ప్రచారం చేశారు. – తొలి బడ్జెట్‌లో కేటాయించింది రూ.5,386 కోట్లు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి అందుకు రూ.13 వేల కోట్లు కావాలి. కానీ, ఆయనకు చిత్తశుద్ధి లేదు. అరకొర కేటాయించినా, ఒక్క రూపాయి ఇవ్వలేదు. – ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపారు. కానీ, బడ్జెట్ డిమాండ్స్‌లో ఆ మొత్తాన్ని రూ.8,278 కోట్లుగా చూపారు. – యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)లో జిల్లాల్లో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి. ఎంత మంది పిల్లలు అనేది జిల్లాల కలెక్టర్లు వివరాలు పెడతారు. – యూడీఐఎస్‌ఈ రిపోర్టు ప్రకారం చూస్తే, 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. వారికి రూ.15వేల చొప్పున ఇవ్వడానికి రూ.13,112 కోట్లు కావాలి. కానీ కేటాయించింది తొలి ఏడాది రూ.5386 కోట్లు. – రెండో ఏడాది కేటాయింపులో ఒకటి, బడ్జెట్ డిమాండ్స్‌లో మరో విధంగా ఉంది. – ఈ ఒక్క పథకం ద్వారా ప్రతి పిల్లాడికి రూ.15 వేల చొప్పున బాకీ. ఈ ఏడాది కూడా లెక్క వేసుకుంటే రూ.30 వేల బాకీ అన్నమాట. అంటే చిన్న పిల్లలను కూడా వదలకుండా బకాయి పెట్టడం హేయం. ఇది అస్సలు బాలేదు. అన్నదాత సుఖీభవ. కానే కాదు: – ఎన్నికల వేళ రైతులకు పీఎం కిసాన్ కాకుండా, అన్నదాతా సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తానన్నాడు. అదే మేము పీఎం కిసాన్‌తో కలిపి ఇచ్చామని విమర్శించాడు. – 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రైతు భరోసా అందింది. వారందరికి రూ.10,717 కోట్లు కావాలి. తొలి ఏడాది రూ.1000 కోట్లు కేటాయించినా, రూపాయి ఇవ్వలేదు. – ఈ బడ్జెట్‌లో రూ.6300 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో కలిపి రైతులకు రూ.40 వేల చొప్పున బకాయి పడ్డాడు. – చంద్రబాబు మోసాలు కొత్త కాదు. 2014 ఎన్నికల ముందు రైతు రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి, కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి రైతులను దారుణందా మోసం చేస్తున్నాడు. దీపం పథకం. సిలిండర్ లేదు: – ఈ పథకానికి దీనికి రూ.4 వేల కోట్లు కావాలి. రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇది కేంద్ర పెట్రోలియమ్ శాఖ వద్ద ఉన్న పూర్తి వివరాలు. ఆ కుటుంబాలకు ఏటా 3 సిలెండర్లు ఫ్రీగా ఇస్తామన్నాడు. – అందుకు ఏటా రూ.4 వేల కోట్లు కావాలి. కానీ, తొలి ఏడాది ఒక సిలిండ్ మాత్రమే కొందరికి ఇచ్చాడు. అందుకు కేటాయించిన మొత్తం రూ.2601 కోట్లు మాత్రమే. 50 ఏళ్లకే పెన్షన్. అవసరమా?: – 50 ఏళ్లకే పెన్షన్ అన్నాడు. అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి. వారికి రూ.4 వేల చొప్పున లెక్క వేస్తే రూ.9,600 కోట్లు కేటాయించాలి. – తొలి ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. – అంటే, ప్రతి మహిళకు ఇప్పటికే రూ.96 వేలు బకాయి. ఈ పథకం ద్వారా చంద్రబాబు మహిళలకు చేసిన మోసం. సూపర్ సిక్స్ ఖర్చు. కేటాయింపు: – మొత్తంగా సూపర్‌సిక్స్‌కు ఎంత అవుతుందని లెక్క వేస్తే.. రూ.79,867 కోట్లు కావాలి. – ఈ బడ్జెట్‌లో అందు కోసం కేటాయించి రూ.17,179 కోట్లు మాత్రమే. ఇందులో ఎంత విడుదల చేస్తారో, ఎంత మందికి కత్తిరిస్తారో చూడాలి. – గత ఏడాది రూ.7282 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి రైతులకు కానీ, తల్లులకు కానీ ఇవ్వలేదు. ఒకే ఒక్క సిలిండర్ కొందరికే ఇచ్చారు. సీఎంగా కొనసాగించడం ధర్మమేనా?: – మొన్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏమన్నాడు. వైయస్సార్‌సీపీ వారికి ఏ పథకాలు ఇవ్వొద్దు అన్నాడు. అసలు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి ఇది బాబు గారి సొమ్మా? ఇది ప్రజల సొమ్ము. ఆయన కేవలం కస్టోడియన్ మాత్రమే. – ప్రభుత్వం ప్రజల సొమ్ముతో, ప్రజల కోసం నడుస్తుంది. ఇదే పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు? పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని. – కానీ, ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అది కూడా బహిరంగంగా. బాహాటంగా ప్రసంగం చేశాడు. – మరి ఆ మాటలు ఏ జడ్జి అయినా, గవర్నర్ అయినా వింటే, ఆ మనిషిని ఒక్క నిమిషం అయినా, సీఎంగా కొనసాగించడం ధర్మమేనా? – ఏం మాట్లాడుతున్నాడు? అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడం ఏ రాష్ట్రానికి అయినా శ్రేయస్కరమా? పెన్షన్లు తగ్గుదల: – మా హయాంలో ఇచ్చిన పెన్షన్లు 66,34,372. అవి మేము దిగిపోయే నాటికి ఇచ్చిన పెన్షన్లు. – అదే ఈరోజు చంద్రబాబు పాలనలో 62,10,969కి పడిపోయాయి. కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వకపోగా, ఉన్నవే తగ్గిస్తూ పోతున్నారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. – ఈ ఏడాది బడ్జెట్ చూస్తే.. పెన్షన్ల కోసం మామూలుగా రూ.32 వేల కోట్లు కావాలి. కానీ ఈ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.27 వేల కోట్లు. – అంటే పెన్షన్ వ్యయం రూ.5 వేల కోట్లు తగ్గింది. పెరగాల్సింది పోయి బడ్జెట్ తగ్గింది. ఇంకా 143 హామీల్లో మచ్చుకు కొన్ని: చంద్రబాబుగారు ఇచ్చిన మిగిలిన 143 హామీలు చూస్తే.. వాటి పరిస్థితి చూస్తే.. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. – వాలంటీర్లకు రూ.5 వేలకు బదుల రూ.10 వేలు. – పెళ్లి కానుక లక్ష. – పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు. – డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలు. అది దేవుడెరుగు. వారికి సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టారు. – ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు. – ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇంకా ఇలా ఎన్నో.. ఇంకా చాలా ఉన్నాయి. ఏవీ నెరవేర్చలేదు. ఇవన్నీ కాక, పెద్దమనిషి చంద్రబాబుగారు ఇంకా ఏమన్నారో చూద్దాం.. అంటూ ఆ వీడియో చూపారు. – ‘ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ఆపబోము. ఇంకా ఎక్కువే. మెరుగైనవి ఇచ్చి ముందుకు తీసుకుపోతాం’. – ‘హామీలు ఇచ్చాం. కానీ బడ్జెట్ చూస్తే భయం వేస్తోంది’. (అసెంబ్లీలో అన్న మాటలు). ఒకసారి భయం అంటాడు. ఇంకోసారి ఆదాయం వచ్చే మార్గం చెవిలో చెప్పమంటాడు. అలా ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. – ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ ఏమిటంటే.. జగన్ పలావ్ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ అన్నాడు. కానీ, అది పోయింది. ఇది పోయింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో: – దేశంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, క్రమం తప్పకుండా పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేశాం. డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. – 4 సీ పోర్టులు. అందులో మూడు పోర్టులు ప్రభుత్వమే స్వయంగా మొదలు పెట్టింది. – 17 మెడికల్ కాలేజీలు. వాటిలో 5 పూర్తి చేశాం. – 10 ఫిషింగ్ హార్బర్లు. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు మొదలుపెట్టాం. దేశంలో ఎవరూ ఆ పని చేయలేదు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ముసలి వారు అయ్యే వరకు చేయి పట్టుకుని నడిపించాం. – డెలివరీతోనే ఆరోగ్య ఆసరా మొదలు.. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత. ఇంకా పెళ్లి సందర్భంగా వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా. – పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి, వృద్ధులకు అండగా ఉన్నాం. – పేదరికం నుంచి శాశ్వతంగా బయట పడేలా మంచి చదువులు అందుబాటులోకి. పలు సంస్కరణలు అమలు. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లను నాడు–నేడుతో పూర్తిగా మార్చేశాం. – తొలిసారిగా గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిష్ మీడియమ్, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్ డిజిటైజ్ చేశాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యా దీవెన. హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన. – ప్రఖ్యాత యూనివర్సిటీలతో అనుసంధానం. ఎడెక్స్ ద్వారా మన కరికులమ్ అనుసంధానం. అన్నీ భ్రష్టు పట్టించారు: – ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు. – చివరకు విద్యా దీవెనను కూడా భ్రష్టు పట్టించారు. దీని కోసం ఏటా రూ.2800 కోట్లు కావాలి. – వసతి దీవెన కింద మేము ప్రతి ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇచ్చాం. అంటే మొత్తం రూ.3,900 కోట్లు కావాలి. – కానీ, చంద్రబాబు గత ఏడాది ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే రూ.3200 కోట్లు బాకీ. – ఈ ఏడాది కూడా చూస్తే మరో రూ.3,900 కోట్లు కావాలి. రెండూ కలిపి రూ.7,100 కోట్లు కావాలి. కానీ ఈ బడ్జెట్‌లో కేటాయించింది రూ.2700 కోట్లు. ఫీజు పోరు: – పిల్లల తరపున పోరాడుతూ, మార్చి 12న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వబోతున్నాం. – విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ, ఈ కార్యక్రమం. వైద్య రంగం నిర్వీర్యం: – వైద్య రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో నాడు విలేజ్ క్లినిక్స్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. 108, 104 సర్వీసులు. 3300 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీలో. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్. ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీలో చికిత్స వ్యయాన్ని రూ.2.5 లక్షలకు తగ్గించారు. – ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ కింద ఉద్యోగాల భర్తీ. దేశ వ్యాప్తంగా నిపుణులైన వైద్యుల కొరత 67 శాతం ఉంటే, ఇక్కడ అది కేవలం 4 శాతమే. వ్యవసాయం ధ్వంసం: – వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. రైతులకు సున్నా వడ్డీ ధ్వంసం. ఉచిత పంటల బీమా ధ్వంసం. ఈక్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. – ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా ధ్వంసం. – అమూల్ ద్వారా సహకార డెయిరీ రంగంలో రైతులకు మేలు. హెరిటేజ్ లాభాల కోసం అమూల్‌ను తప్పిస్తున్నారు. – మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకోలేక పోతున్నారు. 40 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఒక్క రైతు నుంచి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. – ఆ పని చేయకపోగా, అసెంబ్లీలో ఏమన్నాడు? మిర్చి కొనుగోలులో ప్రభుత్వం జోక్యం లేదంటే, వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నాడు? మిర్చి రైతుల నుంచి కొనుగోలు చేసి, సమస్య పరిష్కరించామని ప్రకటించాడు. ఎవరు కరెక్ట్? – ధరల స్థిరీకరణ నిధి కింద రూ.300 కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. – సీఎం–యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరల ప్రకటన. ఆ ధరకు పంటల కొనుగోలు. రూ.7800 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలుకు ఏకంగా రూ.65 వేల కోట్లు ఖర్చు చేశాం. – ఇవాళ ధాన్యంకు గిట్టుబాటు ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేదు. అయినా చంద్రబాబుగారు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి, దేన్నీ పట్టించుకోవడం లేదు. – కులవృత్తులను మేము ప్రోత్సహించాం. తోడు, చేదోడు అమలు చేశాం. – లా నేస్తం, నేతన్న నేస్తం అమలు చేయడం లేదు. గత ఏడాది మత్స్యకార భరోసా కూడా ఎగ్గొట్టారు. ఉద్యోగులకు వంచన: – చివరకు ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. – అధికారంలోకి రాగానే సీపీఎస్, జీపీఎస్ సమీక్ష అన్నారు. కానీ అడుగు ముందుకు పడలేదు. – ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నాడు. మేం నియమించిన పీఆర్సీని తొలగించాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. ఐఆర్ ప్రకటించలేదు. గత ఏడాది లేదు. ఇప్పుడూ లేదు. – మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ప్రస్తావన కూడా లేదు. ప్రతి నెలా 1న జీతాలు అన్నారు. కేవలం ఒక నెల మాత్రమే ఇచ్చారు. ప్రతి నెలా ఎదురుచూపే. – జీపీఎఫ్, ఈహెచ్‌ఎస్ వేల కోట్లు బకాయి పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 3 వేల మందిని మేము రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన 7 వేల మందిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ వ్యయం తగ్గడం విచిత్రం: ఉద్యోగులకు సంబంధించి రెండు ఆసక్తికర మాటలు. – ఏటా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు, ఒక ఇంక్రిమెంట్ కింద జీతం కనీసం 9శాతం నుంచి 10 శాతం పెరుగుతుంది. – కానీ, విచిత్రంగా చంద్రబాబు హయాంలో ఉద్యోగుల జీతాల వ్యయం తగ్గింది. – కొత్త వీసీలను నియమిస్తోంది, ఉన్న ఉద్యోగులను తగ్గించడం కోసమే. రిటైర్ అయిన వారికి ఇచ్చే ఎమౌంట్ కూడా ఏటా పెరుగుతుంది. కానీ చంద్రబాబు హయాంలో అది తగ్గుతోంది. – అంటే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్, పీఆర్‌సీ, డీఏ ఏదీ ఇచ్చేది లేదని చెబుతున్నారు. వచ్చే ఏడాది కూడా అదే పరిస్థితి అని చెబుతున్నారు. అందుకే కేటాయింపులు తగ్గాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం.. – ఇటీవల ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే.. రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్)లో ఉద్యోగుల జీతాల వ్యయం చాలా పెరగడం వల్ల, ఇతర కార్యక్రమాలకు కేటాయించలేక పోతున్నామని. – రూ.89 వేల కోట్లు అని, వారే బడ్జెట్‌లో చెప్పారు. అది రాష్ట్ర సొంత ఆదాయంలో 87 శాతం. – మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే శాతం. మా హయాంలో కోవిడ్ వచ్చింది రెండేళ్లు. మరి, మీరెందుకు సాకులు చెబుతున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? ప్రభుత్వంలో అది రొటీన్. అయినా..: – గత మా ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు తీర్చామని రూ.23 వేల కోట్లు తీర్చామని గొప్పగా చెబుతున్నారు. – ఏ ప్రభుత్వంలో అయినా అది సహజం. మేము కూడా మా హయాంలో చంద్రబాబుగారు వదిలేసిన బకాయిలు వివిధ శాఖల్లో రూ.43,180 కోట్లు ఉన్నాయి. అవి కాక డిస్కమ్‌లు ఇవ్వాల్సిన బకాయిలు మరో రూ.21 వేల కోట్లు. అన్నీ కలిపి చంద్రబాబు ఎగ్గొట్టిపోయిన బకాయిలు మొత్తం రూ.63,724 కోట్లు. హామీలు ఎగ్గొట్టే కుట్ర: – హామీలన్నీ ఎగ్గొట్టడానికి ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అబద్దాలు చెబుతూ, ప్రచారం చేస్తున్నాడు. – చంద్రబాబు ప్రతి అడుగులో చంద్రబాబు అబద్ధాలు, మోసాలు. – అప్పులపై ఇప్పటికీ అసత్య ప్రచారం. ఇప్పుడు కూడా రూ.10 లక్షల కోట్లు అని నిందలు. ప్రజలకు క్షమాపణ చెప్పొచ్చు కదా?: – 2023–24 కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర అప్పు రూ.4,86,151 కోట్లు కాగా, గవర్నమెంట్ గ్యారెంటీ రుణాలు మరో రూ.1.51 లక్షల కోట్లు. రెండూ కలిపి మొత్తం అప్పు రూ.6.46 లక్షల కోట్లు. – 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి మాకు వదిలిపెట్టి పోయిన అప్పు రూ.3.13 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.6.46 లక్షల కోట్లకు చేరింది. ఇది వాస్తవం. – అయినా మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పు అని ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం? – చంద్రబాబుకు ఎల్లో మీడియా వంత. పచ్చి అబద్దాల ప్రచారం. కేవలం సూపర్ సిక్స్ ఎగ్గొట్టడం కోసం, ఇలా చేయాలా? – అలా ఎందుకు అబద్దాలు చెప్పాలి? ఎందుకంత మోసం చేయాలి? అందుకు బదులుగా ప్రజలకు క్షమాపణ చెప్పొచ్చు. అప్పులు చూపకుండా బడ్జెట్: – ఈ ఏడాది బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ క్లియర్‌గా లేదు. రాష్ట్ర అప్పుల వివరాలు అస్సలు ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే.. మళ్లీ అబద్ధాలు చెప్పడం కష్టం కాబట్టి, బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్‌లో అప్పుల వివరాలు చెప్పలేదు. ప్రకటించలేదు. – దీంతో మేము బడ్జెట్ డాక్యుమెంట్ లోతులోకి పోవాల్సి వచ్చింది. – ప్రజలకు అన్నీ అర్ధమయ్యేలా బడ్జెట్ పెట్టాల్సింది పోయి, దాచి పెట్టి దుర్భుద్ధితో బడ్జెట్ పెట్టడం అత్యంత దారుణం. అంత దారుణమైన వ్యక్తి చంద్రబాబు. ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు: – గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. – మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. – ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి. ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నాడు. – మాట్లాడితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటాడు. కానీ, బడ్జెట్‌లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. – మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్): – 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. – ఎస్‌ఓఆర్ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్ నివేదిక చూస్తే.. ఎస్‌ఓఆర్ తగ్గింది. – 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్‌ఓఆర్ చేరుతాయంటున్నారు. – ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా. నాన్ టాక్స్ రెవెన్యూ. 2024–25లో మిస్‌లీనియస్ జనరల్ సర్వీసెస్ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. – ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు? మూల ధన వ్యయం: – 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్ 48 శాతం. ఇది వాస్తవం. – కానీ రివైజ్డ్ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు. ఈ బడ్జెట్ అంకెల గారడీ కాదా?: – చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్‌ఓఆర్ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. – ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్‌డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. – వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకే చెల్లింది. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. ఎమ్మెల్సీ ఎన్నికలపై..: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎప్పుడైనా చూశామా? ఇక్కడ చంద్రబాబు చేశాడు. అయినా శ్రీకాకుళంలో టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు కదా? ఎందుకంటే, అక్కడ రిగ్గింగ్ సాధ్యం కాదు. ప్రతిపక్ష హోదా ప్రస్తావన: గతంలో మేము చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చాం. ఇంత మంది సభ్యులు ఉంటేనే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా రూలింగ్ లేదు. ఢిల్లీలో 80 స్థానాల్లో బీజేపీ కేవలం మూడు మాత్రమే ఉన్నా, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ మేం కూడా టీడీపీకి ఇచ్చాం. నాడు 5గురు టీడీపీ ఎమ్మెల్యేలు మా వైపు వచ్చి కూర్చున్నారు. ఇంకా చాలా మంది రెడీ అయ్యారు. అలా వారి బలం తగ్గినా, మేము ఆయనకు ప్రతిపక్షనేత హోదా ఇచ్చాం. ఎంతసేపు అయినా ఆయన్ను మాట్లాడమని కోరాను. ఆయనకు, నాకు అదే తేడా. అందుకే ఇవ్వడం లేదు: ఇవాళ అసెంబ్లీలో ఉన్నది ఎవరు. మీరు కూటమితో అధికారంలో ఉన్నారు. అంటే ఉన్నది రెండే పార్టీలు. వేరే పార్టీ లేనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మాకే గుర్తింపు ఇవ్వాలి కదా? ఆ పార్టీ లీడర్‌ను ఏమంటారు? ప్రతిపక్ష నేత అంటారు కదా? సభలో లీడర్‌కు ఎంత సమయం ఇస్తారో, ఆ తర్వాత అంతే సమయం విపక్షనేతకు ఇవ్వాలి కదా? కానీ, నీవు విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు అనుకుంటున్నావు కాబట్టి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. మాకు సభలో మైకు ఇస్తేనే కదా, మాట్లాడే అవకాశం వస్తుంది. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ. ఎమ్మెల్యేకు తక్కువ అని మరో ప్రశ్నకు సమాధానంగా శ్రీ వైయస్ జగన్ వ్యాఖ్యానించారు.