అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పరిటాల సునీత సమీప బంధువు ధర్మవరపు రాజన్న మనవడు ధర్మవరపు ఆదర్శ్ దాష్టీకం ప్రదర్శించాడు. అదే గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య పై విచక్షణ రహితంగా కట్టెలతో దాడి చేసి తల పగలగొట్టారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న కురుబ లింగమయ్యను హుటాహుటిన అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడి ని పరామర్శించి బంధువులతో మాట్లాడారు. కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటున్నాడని జీర్ణించుకోలేని ధర్మవరపు ఆదర్శ్, మరి కొంత మంది ఈ దాడికి పూనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా రాప్తాడు నియోజకవర్గం లో అధికార పార్టీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.