సంస్థాగ‌తంగా పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యంగా ప్లీన‌రీ

మ‌రింత మెరుగైన పాల‌న అందించే దిశ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌

బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండ‌వు

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు స‌పోర్టు ఎవ‌రికో చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నెల 8, 9వ తేదీల్లో ప్లీన‌రీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ ప‌టిష్ట‌త‌కు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ప్లీన‌రీలో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కార్యాచ‌ర‌ణ రూపొందించి తీర్మానం చేయ‌నున్నార‌ని చెప్పారు. గ‌త ప్లీన‌రీలో చేసిన తీర్మానాలు, హామీలు వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేశారని తెలిపారు. రాష్ర్ట ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తమ హృదయాలలో పదిలపరుచుకున్నార‌ని, అందుకే సాధారణ ఎన్నికలలో కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చార‌న్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచి ఎన్నికయ్యార‌ని గుర్తు చేశారు. ఈ విధంగా దేశంలోని  మరే రాష్ర్టంలో లేదన్నారు. ప్రజల ఆదారాభిమానాలు ఇంతగా చూపుతున్న ఈ తరుణంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు కాబట్టి వారి అంచనాలు అందుకునే విధంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ప్లీన‌రీ ఏర్పాట్ల‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

 2019లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2017లో జరిగిన ప్లీనరీ ఒకటి. ఆ తరువాత వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర. ఈ రెండు వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి.  2017లో నిర్వ‌హించిన  ప్లీనరీలో వైయస్‌ జగన్‌ కార్యకర్తలకు ఒక స్పష్టమైన ప్రణాళికను నిర్దేశించారు. ఈ స‌మ‌యంలోనే పాదయాత్రను ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి..వారి క‌ష్టాల‌ను క‌ళ్లారా చూశారు. పాదయాత్రలో చూసిన ప్రతి అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ మూడేళ్లలో దాదాపు 95 శాతం హామీలు అమలు చేశారు. గత ప్లీనరీలో ప్రకటించిన వాగ్ధానాలన్నీ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా అమలు చేశారు. రైతులు, అణగారిన వర్గాలకు సంబంధించిన స్పష్టమైన హామీలు నెర‌వేర్చారు, మహిళా సాధికారత, సామాజిక న్యాయాన్ని కచ్చితంగా పాటిస్తూ చేతల్లో చూపించారు. గత ప్లీనరీలోని అంశాలను, ఈ మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ ప్లీనరీలో సమీక్షిస్తాం. కొత్త అవసరాలను, మరింత పరిపుష్టి చేసే విధంగా ఈ ప్లీనరీలో తీర్మానాలు చేస్తాం. మరింత మెరుగ్గా పాలన అందించే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. 
వచ్చే ఎన్నికలపై దృష్టి సారించేందుకు ఈ ప్లీనరీలో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రణాళిక రూపకల్పన చేస్తారు. ఇంకా ఏమేమి చేయాలనే అంశాలపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.  సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే వైయస్‌ జగన్‌ ఆలోచన. వైయస్‌ఆర్‌సీపీని మరింత పటిష్టంగా చేయడానికి మా అధ్యక్షులు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ నిబంధనావళికి తగిన విధంగా మార్పులు చేయడం, ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి పార్టీ జ‌న‌ర‌ల్ బాడీలో మార్పులు ఉంటాయి. జనరల్‌ బాడీకి ఎంత మంది అవసరమో పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. దాదాపు 85 శాతం శ్రేణులు ప్లీనరీకి తరలిరావాలని కోరుతున్నాం.
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు, ఆలోచన విధానాలు, కార్యకర్తల తీరు, మాకు మద్దతు ఇస్తున్న వర్గాల తీరు బీజేపీకి పూర్తి భిన్నంగా ఉంటుంది. బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీకి ఎలాంటి పొత్తు ఉండదు. ఒంట‌రిగానే జనం మన్ననలు పొందేలా వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీ. వారి లక్ష్యాలు వేరే ఉంటాయి. మా విధానాలు, మా ల‌క్ష్యాలు వేరు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు. మొదటి నుంచి కూడా వైయస్‌ జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీకి కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చారు. కొన్ని అంశాల్లో వ్యతిరేకించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ స్టాండ్‌ ఏంటో చెప్పాలి. ఓటు పవిత్రమైంది. ఇంతవరకు చంద్రబాబు ఎవరికి మద్దతు  ఇస్తున్నారో బహిర్గతం చేయ‌లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా కూడా ఈ అంశంపై నోరు మెదపడం లేదు.
మా పార్టీలో అసంతృప్తికి తావే లేదు.  లీడర్‌ హార్డ్‌వర్క్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. పదవులు ఇవ్వకుంటే కదా అసంతృప్తి ఉంటుంది. కష్టపడిన వారికి అందరికీ వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి వారు స్వచ్ఛందంగా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించారు.  ప‌ద‌వులు, ప‌నుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత స్ధానం కల్పించారు. దేశచరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతంపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్దానం కల్పించిన ఘనత   వైయస్ జగన్ గారిదే. అన్ని వర్గాలలో కూడా అట్టడుగున ఉన్న కుటుంబాలకు సంక్షేమపధకాల ద్వారా లబ్దిచేకూర్చడం జరిగిందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.

 

Back to Top