వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుంది. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుందని కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. దమ్ముంటే వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పులివెందులలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం ఉండేది కేవలం వైయస్ఆర్‌సీపీనే. మాకు 11 సీట్లంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైయస్ఆర్‌సీపీ అధినేత, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా? . అదే ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు. వైయస్ జగన్‌ను అవమానిస్తున్నామని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ..ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైయస్ జగన్ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు. నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్ రవి ఓడిపోయాడు.వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే..పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దాం. ఈ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్ సిక్స్ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం..కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు’ అని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు.