కూటమి పాలన అంతా దోపిడీమయమే

మాజీ మంత్రి కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి ఫైర్‌

నెల్లూరు: ఏపీలో కూటమి అంతా దోపిడీమ‌య‌మైంద‌ని, ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని  మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మండిప‌డ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వంద కోట్ల మేర ఇసుక దోపిడీకి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్కెచ్‌ వేశారని ఆరోపించారు. రీచ్‌లకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారని ఆక్షేపించారు. సోమ‌వారం నెల్లూరులో మంత్రి కాకాణి  మీడియాతో మాట్లాడుతూ..‘ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి ఇరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారు. ఈ రీచ్‌కు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారు. వాహనాలను పట్టుకున్న అధికారులను సోమిరెడ్డి బెదిరించారు. రీచ్‌లో ఇసుకను తీసుకెళ్లే దారులను తెగ్గొట్టారు. టీడీపీ నేతలు సూచించిన దారుల్లోనే వెళ్లాలని చెబుతున్నారు. ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోచుకుంటున్నారు. పూడికలు తీయకుండానే  బిల్లులు చేసుకున్నారు. దీనివల్ల నీరు చివరకు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు. ఇసుక, నీటి పారుదల, గ్రావెల్‌లలో అక్రమాలతో పాటు అనధికారికంగా బెల్ట్ దుకాణాలు.. బార్లను కొనసాగిస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. జిల్లాకు కలెక్టర్‌, ఎస్సీలు ఉన్నా.. వారు లేనట్టుగానే ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని కాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి హెచ్చరించారు. 
 

Back to Top