తాడేపల్లి: నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండమని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో మనం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు. అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది. పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంది. ప్రతిపక్షంగా, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగా పార్టీ కొనసాగుతోంది. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగింది. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటాం. బూత్ కమిటీలపై ఫోకస్.. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటాం. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వరకూ కమిటీలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశమయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. అనుబంధ విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. కమిటీలు ఏర్పాటు అన్నది కాగితాలకే పరిమితం కాకూడదు. దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటపై పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా మనం ఎదుగుతాం. గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మనం ఇచ్చిన పిలుపునకు ఉద్ధృతమైన స్పందన వస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అంశాలపై స్పందించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై మాట్లాడాలి. బాధితులకు అండగా నిలవాలి. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అని ప్రజలు చెప్పే పరిస్థితి నెలకొంది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే చెప్తారు. ఇప్పటికీ మనం ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలం. ఎన్నికల మేనిఫెస్టోకు అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. బడ్జెట్‌తోపాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసేవాళ్లం. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా మనం వెనకాడం కాని, అబద్ధాలు చెప్పలేం. నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. విలువలు, విశ్వసనీయ అనే పదాలకు అర్థం ఉండాలి. అధికారం శాశ్వతం కాదు.. అధికారం ఉండొచ్చు.. పోవచ్చు. కానీ, మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ప్రజలు మనం చేసిన మంచి పనుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పివన్నీ వైయస్ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా?. టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. ప్రతీ కుటుంబానికి మంచి చేసే కార్యక్రమాలు మనం చేశాం. కానీ, చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. ప్రతీ ఇంటికీ మన నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రిపేర్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది. పథకాలు నిర్వీర్యం.. ఆరోగ్య శ్రీ పూర్తిగా నీరుగారిపోయింది, ఆరోగ్య ఆసరా లేదు. ఆస్పత్రులు నిర్వీర్యం అయిపోయాయి. మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లీష్ మీడియం లేదు, సీబీఎస్‌ఈ లేదు, టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఉచిత ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పంటలకు ఎంఎస్‌పీలు రాని పరిస్థితి నెలకొంది. ఇంటివద్దకు సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి. లక్షన్నర పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఉంది. దిశ యాప్ కూడా ఏమైందో తెలియదు. దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. డ్యూటీ మరిచిపోయి మూడు సింహాలకు సెల్యూట్ కాకుండా, రాజకీయనాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి. ఇసుక టెండర్లకు రెండు రోజులే గడువు. కనీసం టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ కూడా పోని పరిస్థితి ఉంది. ఇసుక రేటు మన హయాంకన్నా డబుల్ రేటు, ట్రిపుల్ రేటు. మన హయాంలో ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత పకడ్బందీగా మనం అమలు చేశాం. ఇప్పుడు ఇసుక దోచుకోవడానికి పాలసీని మార్చారు. స్టాక్ యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఖాళీ చేసేశారు. లిక్కర్ పాలసీ అక్రమమే.. లిక్కర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ పెట్టి, టైమింగ్స్ తేసేసి, బెల్టుషాపులు లేకుండా చూసి, వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేసేలా చూశాం. ఎమ్మెల్యేలు కమీషన్ల కోసం భయభ్రాంతులకు గురిచేయడం, కిడ్నాపులు చేయడం చేస్తున్నారు. లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీపడుతున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు, ఇప్పుడు రేట్లు అలానే ఉన్నాయి. పర్మిట్ రూమ్స్ తీసుకువస్తున్నారు. బెల్టు షాపులు పెడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. వీరికి, వీళ్ల మనుషులకూ ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండం. ఇలాంటి సమయంలో మనం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తారు. మన యుద్ధం వీరందరితో.. ఇప్పుడున్నది సోషల్ మీడియా కాలం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లతో, టీడీపీ తప్పుడు సోషల్ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మనం అంతకన్నా బలంగా తయారు కావాలి. పార్టీ కమిటీలన్నీ కూడా సోషల్ మీడియాకు అనుబంధం కావాలి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. అన్యాయాలను మనం ఎండగట్టాలి. పార్టీ సందేశాలు కూడా గ్రామస్థాయికి వెళ్లాలి. ఇదంతా సోషల్ మీడియా ద్వారా జరగాలి. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టిపెట్టాలి. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైయస్ఆర్‌సీపీ తయారు చేయాలి. జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్ చేసుకోండి.. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యత మాది. మీలో ఎక్కువ మంది మనం అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ వైయస్ జగన్ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, మానిటరింగ్ ఉంటుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జుల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు కూడా ఉంటాయి. బాగా పనిచేసే వారికీ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.