ఈనాడు, ఆంధ్రజ్యోతికి ముగిసిన డెడ్‌లైన్‌.. 

లీగ‌ల్ నోటీసులు పంపించిన మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

తాడేప‌ల్లి: చెప్పినట్లుగానే టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లీగల్‌ నోటీసులు పంపించారు. తన హయాంలో సెకితో ఏపీ ప్రభుత్వం జరిపిన విద్యుత్‌ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకుగానూ ఆయన నోటీసులు పంపారు. పారదర్శకంగా జరిగిన నాటి ఒప్పందం పత్రాల కాపీలను సైతం వైయ‌స్ జ‌గ‌న్‌ నోటీసులకు జత చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాటి ఏపీ ప్రభుత్వం సెకితో ఒప్పందం చేసుకుందని, కానీ, ఈనాడు,ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయని, కేవలం టీడీపీ ప్రయోజనాల కోసమే అవి అలాంటి కథనాలు ఇచ్చాయని జగన్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆధారాల్లేకుండా ప్రచురించిన ఆ కథనాలతో తన ప్రతిష్టకు దెబ్బ తిందని, కాబట్టి భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు.

క్షమాపణ చెప్పినట్లు ఫ్రంట్‌ పేజీలో వార్త ప్రచురించాలి ఆయన నోటీసుల్లో స్పష్టం చేశారు. సెకితో జరిగిన చారిత్రక ఒప్పందాన్ని వక్రీకరించి కథనాలు ఇచ్చిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువు నష్టం దావా వేస్తానని తాజా ప్రెస్‌మీట్‌లో వైయ‌స్‌ జగన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సదరు తప్పుడు కథనాలకు 48 గంటల్లో స్పందించాలంటూ ఆ మీడియా సంస్థలకు ఆయన్‌ డెడ్‌లైన్‌ కూడా విధించారు. అయినా అవి స్పందించకపోవడంతో ఇప్పుడు అన్నంత పని చేశారు. 

Back to Top