సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్టు ఉంది

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి
 

 తిరుపతి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను చూస్తుంటే మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్టు ఉందని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ, సిట్టింగ్‌ జడ్డీతో విచారణ జరిపించాలని ఆయ‌న డిమాండు చేశారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారిపై తప్పుడు ప్రచారం చేసిన వారికి దేవుడే తగిన శిక్ష విధిస్తాడని హెచ్చ‌రించారు.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను చూస్తుంటే మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్టు ఉంది. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న వారికి దేవుడే తగిన శిక్ష వేస్తాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇదే అంశంపై నెల్లూరు జిల్లాలో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారు. వైయ‌స్‌ జగన్‌పై విమర్శలు చేయడం దారుణం. లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు, లోకేష్‌ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’ అని సవాల్‌ విసిరారు.  

Back to Top