అసెంబ్లీ: వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్ పంపిణీ ఒకటి అని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు గతంలో ఏం జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతుందని తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పెన్షన్ల పంపిణీపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం 40 లక్షల మందితో రూ.వెయ్యి పెన్షన్ ప్రారంభించింది. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 55,61,527 మందికి రూ.2250తో పెన్షన్ పంపిణీ ప్రారంభించిందన్నారు. చివరకు 2018 అక్టోబర్ వరకు 42.66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఎన్నికలకు ముందు అదనంగా పెన్షన్లు ఇవ్వడం, పెంచడం టీడీపీ ఆనవాయితీ ప్రకారం.. 2018 నవంబర్‌లో 9లక్షల మందికి అదనంగా ఇచ్చి 51 లక్షల మందికి ఇచ్చామని చెప్పుకున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం 55.61 వేలతో ప్రారంభించి.. ఈరోజు 61.16లక్షల మందికి పెన్షన్ అందజేస్తోంది. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రూ.27,687 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్ జగన్ ప్రభుత్వం 33 నెలల కాలంలో రూ.47,174 కోట్లు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. 65 నుంచి 60 సంవత్సరాలకు పెన్షన్ వయస్సు తగ్గించడం వల్ల దాదాపుగా 10.60 లక్షల మంది ఈరోజు లబ్ధిపొందుతున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెన్షన్ పంపిణీ గందరగోళంగా.. గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉండేదన్నారు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైయస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలతో పెన్షన్ విషయంలో ఎమ్మెల్యేలుగా తలెత్తుకొని గ్రామాల్లో తిరగుతున్నామన్నారు. రూ.వెయ్యి పెన్షన్ అని చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పాడు. దివ్యాంగులకు రూ.1500 అని చెప్పాడు. 2014 ఎన్నికల తరువాత నాలుక మడతేసి.. 80 శాతం వైకల్యం దాటితే పెన్షన్ ఇస్తానని చంద్రబాబు అన్నాడు. ఎక్కడకు వెళ్లినా 100 శాతం అంగవైకల్యం ఉన్నా.. వైద్యులకు చెప్పి 79 శాతంతో సర్టిఫికెట్ ఇప్పించి.. దివ్యాంగులకు అన్యాయం చేశారు. ఈరోజున వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ బాధితులు.. రూ.2500 నుంచి రూ.3 వేలు, రూ.5వేలు, రూ.10 వేల వరకు వలంటీర్లను పంపించి ప్రతీ నెలా ఒకటో తేదీన వారి చేతుల్లో పెన్షన్ పెట్టిస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్‌దని సగర్వంగా తెలియజేస్తున్నానన్నారు. ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్లు సచివాలయ పరిధిలోనే మంజూరు చేసి.. పంపిణీ చేసే పరిస్థితిని సీఎం వైయస్ జగన్ కల్పించారన్నారు. ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన అవసరం, జన్మభూమి కమిటీలు లేకుండా అర్హత కలిగినవారందరికీ పెన్షన్ అందుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో ఓ దివ్యాంగుడు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి పెన్షన్ అడిగితే.. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఎంపీడీఓకు ఫోన్ చేసి పెన్షన్ ఇవ్వండి అంటే.. ఆ ఎంపీడీఓ జన్మభూమి కమిటీ సభ్యులను ప్రాదేహపడితే వారు ఇవ్వలేదని కలెక్టర్‌కు చెప్పారు. ఏదో విధంగా జన్మభూమి కమిటీలను బ్రతిమాలుకొని సంతకం పెట్టిస్తేనే పెన్షన్ వస్తుందని కలెక్టర్ ఆ దివ్యాంగుడికి తేల్చిచెప్పారని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ గుర్తుచేశారు. ఇటీవల ఓ సమావేశంలో దీని గురించి మాట్లాడితే.. ఓ పెద్దాయన ఫోన్ చేసి మీరు జిల్లా కలెక్టర్ వరకే ఆగిపోయారు.. నేను గవర్నర్ వరకు వెళ్లానండీ అని చెప్పారు. ప్రకాశం జిల్లా పరుచూరు మండలం, ఈనగల్లు గ్రామానికి చెందిన తన్నీరు రాధాకృష్ణమూర్తి 2016 డిసెంబర్ 19న పెన్షన్ కోసం గవర్నర్‌కు లేఖ రాశారు. గవర్నర్ కార్యాలయం 2017 జనవరి 16న దానికి సంబంధించి ఎంపీడీఓకు కాపీ అందజేశారు. జన్మభూమి కమిటీ సిఫారస్సు లేదని పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని ఎంపీడీఓ తెలిపారు. అంతటితో వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నారు. అయినా గ్రామ జన్మభూమి కమిటీ ఆమోదంతోనే పెన్షన్ మంజూరు చేయబడును అని ఎంపీడీఓ రాశారు. తన్నీరు రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన సభ్యత్వ నమోదును కూడా అర్జీకి జత చేశాడు. పెన్షన్ కోసం ఆ పెద్దాయన పాదయాత్ర కూడా చేశాడని ఎమ్మెల్యే కాకాణి గుర్తుచేశారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా చూశామా..? అర్హత లేకపోయినా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి పెన్షన్‌లు మంజూరు చేసిన అంశంపై విచారణ చేపట్టాలని సంబంధిత మంత్రిని కోరుతున్నానన్నారు. ఈరోజు అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందిస్తున్నారు. కొన్ని పెన్షన్లు సాంకేతిక కారణాల వల్ల రీవెరిఫికేషన్‌కు వచ్చాయని, ప్రపోజ్ చేసేటప్పుడు ఆర్టీజీఎస్‌లో అప్‌డేట్ కానందువల్ల వెనక్కు వస్తున్నాయని అంటున్నారు.. దాంట్లో కూడా అప్‌డేట్ చేస్తే పూర్తిస్థాయిలో పెన్షన్ అందించినట్టు అవకాశం ఉంటుంది. భర్తల స్థానంలో ఇచ్చే పెన్షన్‌ను భార్యలకు జాప్యం లేకుండా మంజూరు చేస్తే బాగుంటుందని మంత్రి కోరుతున్నానన్నారు.