అవినీతి కార్యకాలాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం

అందుకే చంద్రబాబు అదే పనిగా బురద చల్లే రాజకీయాలు

వైయ‌స్ఆర్‌సీపీ, వైయ‌స్ జగన్‌గారిపై నిరంతరం విషం చిమ్ముతున్నారు

అవాస్తవాలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజం

చంద్రబాబు దుబారా వ్యయం అక్షరాలా రూ.3628 కోట్లు

హంగు, ఆర్భాటాలు, ప్రచారం, విలాసాల కోసం ఆ వ్యయం

2014–19 మధ్య నిధులు మంచినీళ్లలా ఖర్చు చేసిన బాబు

గణాంకాలతో సహా పుత్తా శివశంకర్‌ వెల్లడి 

నాలుగు నెలల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు లేదు

ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌. అదే బాబు వైఖరి

తాజాగా లిక్కర్‌ మాఫియాపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఎల్లో సిండికేట్‌కే 90 శాతం వైన్‌షాప్‌ల కేటాయింపు

స్కిల్‌ స్కామ్‌లో రూ.24 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్‌

దీంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫెన్సింగ్‌పై ప్రచారం

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ స్పష్టీకరణ 

తాడేపల్లి: అవినీతి కార్యకాలాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం చేస్తున్న చంద్రబాబు, అదే పనిగా బురద చల్లే రాజకీయాలు చేస్తున్నారని..వైయ‌స్ఆర్‌సీపీ, వైయ‌స్‌ జగన్‌గారిపై నిరంతరం విషం చిమ్ముతున్నారని, అవాస్తవాలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడారు.

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోకపోవడమే కాకుండా, అన్ని రంగాల్లో విఫలమైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారని పుత్తా శివశంకర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ల్యాండ్, శాండ్‌ మాఫియాలు విజృంభిస్తుండగా, తాజాగా లిక్కర్‌ మాఫియా తయారైందని ఆయన ఆక్షేపించారు. వైన్‌షాప్‌లకు టెండర్లు మొదలు, లాటరీలో షాప్‌ల కేటాయింపు వరకు ఎల్లో సిండికేట్‌దే రాజ్యమని, దాదాపు 90 శాతం వైన్‌షాప్‌లు వారికే దక్కాయని తెలిపారు. దీంతో రాష్ట్రమంతా విమర్శలు వెల్లువెత్తుతుండగా, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌గారి ఇంటి ఫెన్సింగ్‌పై దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పారు.

అది ఎస్‌ఆర్‌సీ నిర్ణయం:
    వైయ‌స్ జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) సమీక్ష జరిపి, అధికారులు తీసుకున్న నిర్ణయం తప్ప, అది జగన్‌గారు తీసుకున్న నిర్ణయం కాదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అప్పుడు ఆయన భద్రతకు అది అవసరం అని భావించిన అధికారులు, ఆ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్‌ మీడియా దీనిపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. 

చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ఎప్పుడు ప్రభుత్వానికి ఏ ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా, దాన్నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడం చంద్రబాబుకు అలవాటన్న పుత్తా శివశంకర్‌.. ఈ నాలుగు నెలల్లో ఆయన ఎప్పుడెప్పుడు, ఏం చేశారనేది వివరించారు.
– చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ వెల్లడించడంతో.. ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం. ఫైల్స్‌ దహనం అంటూ ప్రచారం.
– రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలనపై వైయస్ఆర్‌సీపీ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో ఉద్దేశపూర్వకంగా ఫైల్స్‌ దహనం చేశారంటూ.. నానా హంగామా చేసి, డీజీపీని హెలికాప్టర్‌లో పంపించారు.
– రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్‌ స్కూల్స్, ట్రిపుల్‌ ఐటీలు, ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీల్లో ఫుడ్‌ పాయిజన్‌ కేసులు బయట పడడంతో, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్లు అంటూ సెలబ్రేషన్స్‌. ప్రచారం
– రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల మీద వివక్ష, వేధింపులకు పాల్పడడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ కేసు తీసుకొచ్చి డైవర్షన్‌.
– గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్స్‌లో హిడెన్‌ కెమెరాలపై 300 మంది విద్యార్థినిలు ఆందోళనకు దిగితే.. వీఆర్‌లో ఉన్న ఐపీఎస్‌లు అంతా రోజూ డీజీపీ ఆఫీస్‌కు వచ్చి సంతకాలు పెట్టాలంటూ మెమోలు జారీ చేశారు.
– ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు వరద విజయవాడను ముంచెత్తి, లక్షలాది మంది నరకయాతన పడ్డారు. దీంతో మళ్లీ డైవర్షన్‌. బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి, కూల్చాలని ప్రయత్నించారంటూ దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలో అదేపనిగా ఊదరగొట్టారు.
– మరోవైపు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం విఫలం కావడంతో, ప్రజలు ఆగ్రహంతో ఉంటే.. వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తుంటే రైలు ఢీకొట్టబోయిందని, తృటిలో ప్రమాదం తప్పిందని ప్రచారం చేశారు. దాంతో పాటు, వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఎర వేసి మరో డైవర్షన్‌కు ప్రయత్నించారు.
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ఆందోళన జరుగుతుంటే.. కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేశారు.
– కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన. అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం. హామీలపై ప్రజలు ప్రశ్నిస్తుండడంతో.. తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారంటూ దుష్ప్రచారం. నానా హంగామా.
– రాష్ట్రంలో ఇప్పటికే శాండ్‌ మాఫియా. తాజాగా లిక్కర్‌ మాఫియా. ఎల్లో సిండికేట్‌కే మద్యం షాప్‌ల కేటాయింపు. ఒక మంత్రి అనుచరులకు మూడు షాప్‌లు. ఇలా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. హఠాత్తుగా జగన్‌గారి ఇంటి ఫెన్సింగ్‌పై దుష్ప్రచారం మొదలు పెట్టారు.
    అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరన్న వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, వారికి అన్నీ తెలుసని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను వారూ గుర్తించారని స్పష్టం చేశారు.

చంద్రబాబు అపరిమిత దుబారా వ్యయం:
    జనం సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేసే చంద్రబాబు, దుబారా ఖర్చులకు ఆయన కేరాఫ్‌గా మారారని పుత్తా శివశంకర్‌ తెలిపారు. 2014–19 మధ్య ప్రచార ఆర్భాటాలకు, హంగులు, విలాసాలకు తాత్కాలిక నిర్మాణాలకు కలిపి మొత్తం రూ.3,628.17 కోట్ల ప్రజల సొమ్ము చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆయన వెల్లడించారు.
    ఈ సందర్భంగా చంద్రబాబు దుబారా వ్యయాన్ని శివశంకర్‌ గణాంకాలతో సహా వివరించారు.
చంద్రబాబు ఆర్భాటపు వ్యయాలు (రూ. కోట్లలో) 

  • – ప్రత్యేక విమానాల ప్రయాణం ఖర్చు –100
  • – హైదరాబాద్‌లో సీఎం కార్యాలయానికి (ఎస్‌ బ్లాకు) –14.63
  • – హైదరాబాద్‌లో తొలుత సీఎం కార్యాలయం (హెచ్‌ బ్లాకు) –6.29
  • – లేక్‌వ్యూ గెస్ట్‌ హౌజ్‌లో చేసిన వ్యయం –9.47
  • – సీఎం కార్యాలయ ఫర్నిచర్‌ –10
  • – మదీనాగూడ ఫాంహౌస్, జూబ్లీహిల్స్‌ అద్దె ఇంటికి –4.37
  • – ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌజ్, సీఎం క్యాంపు ఆఫీస్‌ విజయవాడ –42
  • – సీఎం ప్రత్యేక బస్సు –5.50
  • – రాజధాని నిర్మాణానికి ప్రధానితో శంకుస్థాపన –250
  • – ఆ తర్వాత మూడు శంకుస్థాపనల వ్యయం –100
  • – రాజధాని కన్సల్టెంట్స్‌కు –300
  • – తాత్కాలిక సచివాలయం, ఇతర మరమ్మతులు –1,100
  • – రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం –115
  • – జన్మభూమి కార్యక్రమాలకు –150
  • – నవ నిర్మాణ దీక్షల కోసం –80
  • – విదేశీ పర్యటనలు (అందరూ కలిసి) –120
  • – పోలవరం బస్సు యాత్ర –121.81
  • – పోలవరం ఈవెంట్ల కోసం –152
  • – గోదావరి పుష్కరాల ప్రచారానికి –110
  • – కృష్ణా పుష్కరాల ప్రచారానికి –47
  • – రాజధాని బస్సు యాత్రలకు    –39.88
  • – రాజధానిలో సింగపూర్‌ సెట్టింగులకు –44.50
  • – ఎన్నికల ముందు బాబు ప్రచారానికి –582
  • – హ్యాపీ సిటీస్‌ సదస్సుల కోసం –100
  • – గుంటూరు జిల్లాలో ఈవెంట్ల వ్యయం –23.72
  •     ఇలా చంద్రబాబు ఆర్భాటాలకు ఆ 5 ఏళ్లలో చేసిన మొత్తం వ్యయం ఏకంగా రూ.3,628.17 కోట్లు అని పుత్తా శివశంకర్‌ వివరించారు.

    జనం సొమ్ము అంటే ఏ మాత్రం విలువ, లెక్కలేని చంద్రబాబు ఆ స్థాయిలో దుబారా చేసి, ఇప్పుడు ఫెన్సింగ్‌పై ఈ స్థాయిలో నిందించడం, అదేపనిగా దుష్ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
    
చంద్రబాబు అవినీతికి మరో రుజువు:
    స్కిల్‌ స్కామ్‌కు సంబంధించి, ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను ఈరోజు (మంగళవారం) సాయంత్రం అటాచ్‌ చేసిందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. దాన్నుంచి డైవర్ట్‌ చేయడం కోసం కూడా వైయ‌స్ జగన్‌గారి ఇంటి ఫెన్సింగ్‌పై దుష్ప్రచారం మొదలు పెట్టారని పుత్తా శివశంకర్‌ వివరించారు.

Back to Top