తాడేపల్లి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ‘ఈడీ’ క్లీన్ చిట్ ఇవ్వలేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తేల్చిందని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్కిల్‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తుతో చంద్రబాబు మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. తనకు ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి చురకలంటించారు. ఆ కేసులో తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ, ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. స్కిల్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుందన్న ఆయన, అందుకు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను ఉదహరించారు. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని తెలిపారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని, ఈడీ అటాచ్‌మెంట్ రాగానే వణికిపోతున్నారని, అందుకే ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్‌చిట్ విషయం లేకపోయినా, తనకు కేసులో క్లీన్‌చిట్ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని సతీష్‌రెడ్డి గుర్తు చేశారు. ‘చంద్రబాబు తనకు తాను సొంతంగా క్లీన్‌చిట్ ఇచ్చుకుంటే సరిపోతుందా?’ అని నిలదీశారు. అసలు ఈ వ్యవహారంలో నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన సతీష్‌రెడ్డి.. ఆ ఆస్తులకు డబ్బులు ఇచ్చింది చంద్రబాబుగారు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుగారు 13 చోట్ల స్వయంగా సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా? అని నిలదీశారు. చంద్రబాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకు వెళ్లింది?. మరి ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు, చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా?. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా?. అంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు కాదా?. ఇన్ని ఆధారాలు చాలా స్పష్టంగా ఉంటే, మరోవైపు కేసును ఈడీ దర్యాప్తు చేస్తుంటే.. క్లీన్‌చిట్ ఇచ్చిందని ఎలా చెప్పుకుంటారు?. అని సతీష్‌రెడ్డి గట్టిగా నిలదీశారు. సీమెన్స్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిని షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి.. ‘డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (డీటీఎస్‌పీఎల్) ఎండీ వికాస్ వినాయక్ ఖండేల్కర్, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, అతని అనుచరులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ దారి మళ్లించారని ఈడీ తన నోట్‌లో పేర్కొన్న విషయాన్ని సతీష్‌రెడ్డి గుర్తు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరోసారి ఆస్తులు అటాచ్ చేశారని తెలిపారు. అయినా ఈడీ తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ‘ఒకవేళ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇస్తే కోర్టులు ఇవ్వాలే తప్ప, అసలు విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారు’ అని ఆయన ప్రశ్నించారు. మొత్తం రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో కూడా అదే కచ్చితంగా తేలుతుందని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు.