పాపం బాబుగారి చక్రం తిరగడం లేదు. ఇదేదో జాతక చక్రం గురించి అనుకునేరు. అస్సలు కాదు. ఆయనగారి రాజకీయ చక్రం. 40 ఏళ్ల అనుభవం చేసే మేనేజ్మెంట్ చక్రం. కేంద్రంలో లాలూచీల చక్రం. అధికారులతో అనుకూలంగా పని చేయించుకునే చక్రం. ఇవేవీ పాపం తిరగడం లేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన సైకిల్ చక్రం తిప్పుకోవడమే కష్టంగా ఉంది. కేంద్రంలో ఆయన సైకిల్ బెల్లు మోగడం ఎప్పుడో ఆగిపోయింది. దేశ రాజధానిలో టోటల్ గా సైకిల్ హ్యాండిల్ వంకర పోయింది. ఇక రిపేరు చేసినా పనికిరానంతగా తుప్పట్టిపోయిన సైకిల్ ను మరమత్తు చేసుకునేందుకు చంద్రబాబు అష్టకష్టాలూ పడుతున్నాడు. షెడ్డుకు చేరాల్సిన సైకిల్ ను ముస్తాబు చేసైనా 2019 ఎన్నికల్లో సేల్ చేయాలని తాపత్రయపడుతున్నాడు. అరువు తెచ్చుకున్న నేతలతో ప్రచారం దిల్లీ నుంచి కేజ్రీవాల్, కాష్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఇలా వీలున్నవారినల్లా ప్రచారానికి వాడుకోవాలన్నిది చంద్రబాబు ప్లాన్. తెలంగాణాలో మహా కూటమి ఎఫెక్టుతో కాంగ్రెస్ దూరంగా ఉండిపోయినా అంతర్లీనంగా బాబుకు సహకారం ఎలాగూ అందిస్తోంది. గతంలో ఈ ముఖ్యమంత్రుల రాజకీయ అవసరాలకు చంద్రబాబు అప్పుడు మద్దతు పలికింది, ఇప్పటి ప్రచారానికి వారి సహకారం కోసమే అని వేరే చెప్పక్కర్లేదు. మోదీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి నామమాత్ర మద్దతిచ్చి నారా తన ప్రచారానికి రావాల్సిందని అప్పుడే సెటిల్మెంట్ చేసుకున్నాడంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కరువు కనుక ఇలా అరువు నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నాడు. ప్రతిపక్షం నుంచి దొంగిలించిన హామీలు ఎలాగూ ఉన్నాయి. దీనికి తోడు బాబు వెంట వచ్చింది మహా మహా ముఖ్యమంత్రులంటూ మహాభజన చేసేందుకు ఆస్థాన మీడియా ఉండనే ఉంది. వీటన్నిటితో పదిరోజుల్లో రానున్న ఎన్నికల రణరంగాన్ని జయించేయచ్చనే భ్రమలో ఉన్నాడు చంద్రబాబు.