రాష్ట్రంలో, దేశంలో, దేశదేశాల్లో, యావత్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే పెద్ద చర్చ. దాదాపుగా రచ్చ. ఏం జరగబోతోంది ఏపీలో. ఏం కానుంది భవిష్యత్తు. చంద్రబాబు చూపు ఎటువైపు. దిల్లీ ప్రధాని పీఠం వైపా? ఉప రాష్ట్రపతి కుర్చీవైపా? అమెరికా అధ్యక్ష పదవి వైపా? ఐక్యరాజ్యసమితి సీటు వైపా? అందరూ ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆయన ప్రధాని అయితే దేశం ఎంత ముందుకెళిపోతుంటుందంటే...గ్లోబులో దేశపటం ఎక్కడుందో వెతకడం కూడా కష్టం అయిపోతుంది. ఉప రాష్ట్రపతి అయితే షాంఘై భారతో, అమెరికన్ ఇండియాగానో రూపు దిద్దుకుంటుంది. అదే అమెరికా అధ్యక్షుడైపోతే ఆల్ కంట్రీస్ లో పసుపు కుంకుమ పంచబడుతుంది. అన్నదాతా సుఖీభవ అమలైపోతుంది. దీని గురించే బిల్ గేట్స్ బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్నాడు. అనిల్ అంబానీ అన్నం తినడం మానేసి థింక్ చేస్తున్నాడు. మోదీ గజగజా వణుకుతున్నాడు. రాహుల్ కళ్లలో కర్పూరం వెలిగించుకుని ఎదురు చూస్తున్నాడు. బాబు ఎప్పుడు ఏమి అవుతాడో అని? ప్రపంచం అంతా ఇలా బాబు గురించి భయంభయంగా ఆలోచిస్తుంటే... చంద్రబాబు మాత్రం తన ఇంట్లో తాపీగా కూర్చుని మనవడు దేవాన్షును ఒళ్లో కూర్చోబెట్టుకుని పప్పన్నం తినిపిస్తున్నాడు. తినిపిస్తూ బాబూ దేవాన్ష్ నాకు ప్రధాని పదవి ఆఫర్ లో ఉంది, ఉప రాష్ట్ర పతి పోస్టుకు కూడా పిలుపు ఉంది, అమెరికా అధ్యక్షుణ్ణి కావాలని కూడా పట్టుబడుతున్నారు ఏం చేయాలంటావ్ అని అడిగాడు... అరక్షణం ఆలోచించిన దేవాన్ష్ అదేం పెద్ద విషయం తాతా అన్నిటినీ కలిపి ప్రధానపతి ప్రెసిడెంట్ గా పుచ్చేసుకో అన్నాడు. తన మనవడి మాటలకు మురిసిపోతూ అలాగే బాబూ అన్నాడు చంద్రబాబు.