చీపేష్ తెగ బుర్రగోక్కుంటున్నాడు. చెంబేష్ ముక్కు మీద వేలెట్టి తెగ థింకుతున్నాడు. ఇద్దరూ వేళ్లు ముడుచుకుని సీరియస్ గా లెక్కలేసుకుంటున్నారు. ‘ఈ లెక్కన ముందు నువ్వా నేనా’ అడిగాడూ ఏమీ తేల్చుకోలేక చీపేష్. ‘ఏ విషయంలో’ తన లెక్క గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అర్థంకాక అడిగాడు చెంబేష్. అర్థం కాక బొల్లి ముఖం తెల్ల ముఖం వేయడం చూసి మరింతగా వివరించాడు చీపేష్ ‘ తండ్రి కంటే ముందే కనకాంబరం జైలుకెళ్లిచ్చాడు గదా. ఇప్పుడు అదే రూమ్ లో తండ్రి చీనాంబరాన్ని కూడా కూర్చోబెట్టార్ట కదా? తర్వాత లైనులో నువ్వు ముందా నేను ముందా అని అడుగుతున్నా’ అన్నాడు. ‘ఒరే చీపేషా... అసలే పాత కేసులన్నీ తిరగబడుతున్నాయి. తీగలాగుతుంటే మన డొంక, కొంప కదులుతున్నాయ్. కటకటాల కథ మనదాకా రాకూడదని కొందరిని అండర్ గ్రౌండ్ కి, కొందరినేమో సేఫ్ జోన్ లోకీ పంపిస్తూ నానా కష్టాలు పడుతుంటే నువ్వప్పుడే జైలు, ఊచలు అంటావేమి రా అక్షరాలు రాని అక్కుపక్షి’ అని చీవాట్లేశాడు తండ్రి చెంబేష్. ముఖం మాడిపోయిన పప్పులా మార్చుకున్న చీకేష్ మళ్లీ ‘అదిగాదు నాన్నా కనకాంబరానికి బెయిల్ రాకుండా ఉండుంటే ఎంచక్కా ఇద్దరూ అచ్చంగాయలో, గచ్చకాయలో ఆడుకునేవాళ్లు గదా. రేపు నేను ముందెళ్లినా నువు ముందెళ్లినా ఇద్దరికీ ఒకే బ్యారెక్ ఇవ్వాల్సిందే అని ఇప్పుడే ధర్నా చేద్దాం’ అన్నాడు. ‘అంటే రాజమండ్రో, తీహారో కన్ఫమే అంటావా?’ ’కాదా మరి. కరకట్ట మొదలు కనికట్టు కమీషన్ల ప్రాజెక్టుదాకా ఎక్కడ చూసినా మన కహానీనే కదా. ’. ‘వరదకు పడవ అడ్డంపడ్డట్టు మన కేసులకు అడ్డం పడమనే కదా మనోళ్ల రంగు మార్చి దేశ రాజధానిదాకా పంపింది’. ‘పంపినోళ్ల సంగతేమో గానీ పారిపోయినోళ్లను పట్టుకోడానికి పోలీసులు తిరుగుతున్నార్ట’ ‘నువు నా పాలిట నరకాసురుడివిరా’ తలపట్టుకుంటూ అన్నాడు చెంబేష్. ‘నరకుడి’ నాన్న పేరేంటి నాన్నా అంటూ తుర్రుమన్నాడు చీపేష్.