చిత్తూరు జిల్లా: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలని పిలుపునిచ్చారు. వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చామని సీఎం చెప్పారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. పుత్తూరు సిద్ధమా?. రెండున్నర కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది.అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఆత్మీయతలు మధ్య నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడి, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరుపేరునా మీ బిడ్డ, మీ జగన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. *మూడు రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం.* కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యంకాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్ధం. అందరూ ఈ విషయాలను కూడా గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అన్నది ప్రతి ఒక్కర్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ.. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈరోజు నేను చెబుతున్న ఈ మాటలు, ఈరోజు నేను చెబుతున్న ఈ పనులు, ఈరోజు నేను చెబుతున్న ఈ మార్పులు.. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా? మనకెప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల్లోనే గతంలో ఎప్పుడూ జరగనివిధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు.. మరొక్కసారి చెబుతున్నా వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు..130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్లిపోతున్నాయి. గతంలో ఎప్పుడైనా కూడా ఈమాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్లిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?. అని మీ బిడ్డ అడుగుతున్నాడు. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా? జరిగిందా చెల్లెమ్మా. ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా దశాబ్ధాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంతవరకు కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు ఎన్ని అంటే 4 లక్షలు.. మరి ఈ 59 నెలలకాలంలో మీబిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా మరో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాడు. *మేనిఫెస్టో అమలు చేయడం ద్వారా విశ్వసనీయతకు అర్ధం చెప్పాం.* మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టో అన్నదానికి, విశ్వసనీయతకు అనే పదానికి అర్థం తీసుకొచ్చాం. మేనిఫెస్టో అన్నది గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలిచ్చి, రంగురంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌గా భావిస్తూ... మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి నా అక్కచెల్లెమ్మల ఇళ్లకే, నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్కా మీరే టిక్ పెట్టండి, చెల్లెమ్మా మీరే టిక్ పెట్టండి, మీ అన్న ఇవన్నీ చెప్పాడు.. చెప్పినవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్ పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి మీరే టిక్ పెట్టండి అని చెప్పి అడుగుతున్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే అది ఈ 59 నెలలకాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. *గతంలో ఈ పథకాలున్నాయా?- ఆలోచించండి.* నేను ఇప్పుడు మీ అందరికీ గడగడా కొన్ని పథకాలు చెబుతాను. నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా? అని నేను మిమ్మల్నే ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు స్కూళ్లు, గవర్నమెంటు బడులన్నీ మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో ఐఎఫ్‌బీల ద్వారా డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో 8వతరగతికి వచ్చేసరికి ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్టు టీచర్లు, ఇంగ్లిష్ మీడియంతో మొదలుపెడితే ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీ మళ్లీ ఇంగ్లిష్‌తో అందుబాటులోకి తెచ్చాం. అంటే మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో గతంలో లేని గోరుముద్ద ఇవాళ పిల్లలకు, మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి అనే ఒక పథకం మొట్టమొదటిసారిగా జరుగుతోంది. పెద్ద చదువులకు ఏ తండ్రి ఏ తల్లి అప్పులపాలు కాకూడదని ఈరోజు ఏకంగా ఇంజినీరింగ్ చదువుతున్న పిల్లలు, డాక్టర్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలకు రాష్ట్రంలో ఉన్న ఏకంగా 93 శాతం మంది పిల్లలకు పూర్తి ఫీజులు అందిస్తూ ఓ జగనన్న విద్యాదీవెన, ఓ వసతి దీవెన కార్యక్రమాలు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ ఆలోచన చేయనివిధంగా, మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలలో అనుసంధానంగా ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్ వారి చేత సర్టిఫైడ్ కోర్సులు, మొట్టమొదటిసారిగా మన డిగ్రీ కోర్సుల్లో మేండేటరీ ఇంటర్న్‌షిప్ అందుబాటులోకి తెస్తున్నాం. నేను ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్కచెల్లెమ్మలను నా అక్కచెల్లెమ్మల కుటుంబాలను, నా అన్నదమ్ములను అందరనీ కూడా అడుగుతున్నాను గతంలో ఎప్పుడైనా ఇలా పిల్లల మీద ధ్యాస పెట్టి, పిల్లల చదువులమీద ధ్యాస పెట్టి ఇన్ని విప్లవాలు ఎప్పుడైనా గతంలో జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? జరిగాయా అక్కా? జరిగాయా చెల్లెమ్మా? పెద్దమ్మ జరిగాయా?. నా అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా నా అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ,ఓ చేయూత, ఓ కాపునేస్తం,ఓ ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, అందులో కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. నేను ప్రతి అక్కను అడుగుతున్నాను, చెల్లెమ్మను అడుగుతున్నాను, ప్రతి అన్నను అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇన్నిన్ని పథకాలు నా అక్కచెల్లెమ్మల కోసం ఎప్పుడైనా ఉన్నాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఉన్నాయా అక్కా? ఉన్నాయా అమ్మా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అన్నా? అక్కా ఉన్నాయా?. *పేదల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు.* గతంలో ఎప్పుడూ చూడనివిధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్.. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే తలుపుతట్టే పథకాలు.. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.అన్నా వచ్చాయా? ఇంటికే పథకాలు వచ్చాయా? ఇంటివద్దకే రేషన్ వచ్చాయా? అక్కా ఎప్పుడైనా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వచ్చిందా? వచ్చిందా అవ్వా ఇంటికే పెన్షన్? పెద్దమ్మ ఇంటికే పెన్షన్ వచ్చిందా?. రైతన్నలకు ఎప్పుడూ జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనవిధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ.. నేను అడుగుతున్నా ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. జరిగిందా అన్నా? ఒక రైతుభరోసా గతంలో ఉండేదా? పెట్టుబడికి సహాయం అందేదా?. *స్వయం ఉపాధికి తోడుగా...* స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఈరోజు సొంతు ఆటోలు, సొంత ట్యాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాన్ని మోస్తున్న నా డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకారభరోసా, ఈరోజు పక్కనే రోడ్లలో ఫుట్‌పాత్‌ల మీద కూరగాయలు, ఇడ్లీలు అమ్ముతున్న నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా? అటువంటి శ్రమ జీవులకు, అటువంటి కష్ట జీవులకు ఈరోజు ఓ తోడు, ఓ చేదోడు ఇటువంటివన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. లాయర్లను కూడా మర్చిపోకుండా లాయర్లకు లా నేస్తం అందించాం. ఇలాంటి పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయా అన్నా? అక్కా ఉన్నాయా? చెల్లెమ్మా ఉన్నాయా? పెద్దమ్మా ఉన్నాయా? తమ్ముడు గతంలో ఉండేవా?. *ప్రతి పేదవాడికి అండగా- రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ.* ఎప్పుడూ జరగనివిధంగా ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన రూ.25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి ఇబ్బంది కాకూడదని చెప్పి ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ఇంటి తలుపు తడుతూ ప్రతి ఒక్కరికీ కూడా టెస్టులు చేస్తూ, ప్రతి ఒక్కరికీ కూడా మందులిస్తూ ఇంటివద్దకే ఈరోజు ఆరోగ్య సురక్ష.. ఇలా పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయా అన్నా? ఉన్నాయా చెల్లెమ్మా? ఉన్నాయా అక్కా? అని అడుగుతున్నాను. *600 రకాల సేవలతో సచివాలయాల్లో గ్రామ స్వరాజ్యం.* ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్లినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది, అదే గ్రామంలో 60-70 ఇళ్లకు చేయి పట్టుకుని నడిపిస్తూ వాలంటీర్ వ్యవస్థ, అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే నాడు-నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు, అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్కచెల్లెమ్మల కోసం వాళ్ల ఫోన్లలోనే ఓ దిశ యాప్.. ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్లో ఉన్న దిశ యాప్‌లో ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మా ఏమైంది అని చెప్పి ఆ అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతున్న పరిస్థితి. ఏవైతే నేను చెప్పానో ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు, చెప్పిన ఈ పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఉన్నాయా అన్నా? ఉన్నాయా అక్కా? ఉన్నాయా చెల్లెమ్మా? గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?. *పేదవాడికి ఒక్క మంచీ చేయని బాబు పాలన.* ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే ఈ 59 నెలలకాలంలో మాత్రమే జరిగాయి. మరోవంక చంద్రబాబును ఒక్కసారి చూడమని అడుగుతున్నాను. 14 ఏళ్లు పాటు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు పేరు చెబితే ఏ పైదవాడికైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గానీ, ఒక్కటంటే ఒక్క స్కీమ్ గానీ గుర్తుకు వస్తుందా?.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి గానీ, ఆయన చేసిన ఒక స్కీమ్ గానీ ఏ పేదవాడికి కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. *బాబు అంటే అధికారం వచ్చేదాకా అబద్దాలు- వచ్చాక మోసాలు.* ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి. అధికారం వచ్చేదాకా అబద్ధాలు, అధికారం వచ్చేదాకా మోసాలు. అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతున్నా (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ). 2014లో అక్కా ఇదొక్కసారి చూడండి. 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వారి ఫోటోలు పెట్టి.. ఈ పాంప్లెట్‌లో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇందులో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే 2014 నుంచి 2109 వరకు మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి... కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. నేను ఒకసారి చదువుతాను. ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా? లేదా? అన్నది మీరే చెప్పండి. *చంద్రబాబు విఫల హామీలు.* మొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. నేను అడుగుతున్నాను రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు. చంద్రబాబు హయాంలో రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? మూడో హామీ, అక్కా మూడో హామీ కూడా ఆడవాళ్లదే. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు కనీసం ఒక్క రూపాయైనా మీ బ్యాంకుల్లో వేశాడా? అని అడుగుతున్నాను. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా ?. అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాఫీ అన్నాడు. జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా?. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా ? మన నగరిలో కనిపిస్తోందా? ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌లో 5 సంవత్సరాలలో ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. అన్నా నమ్మవచ్చా? అక్కా నమ్మవచ్చా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. *మళ్లీ కొత్త హామీలతో వస్తున్న బాబు.* ఈరోజు ఏమంటున్నాడు? సూపర్ సిక్స్ అంటున్నారు నమ్మొచ్చా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్మొచ్చా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నాడు నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? అక్కా నమ్మొచ్చా? తమ్ముడు నమ్మొచ్చా? అక్కా ఇంటింటికీ కేజీ బంగారమట నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ అంట నమ్ముతారా? నమ్ముతారా అన్నా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు. మళ్లీ ఈరోజు కేజీ బంగారమంటున్నాడు, బెంజి కార్ అంటున్నాడు, సూపర్ సిక్స్ అంటున్నాడు, సూపర్ సెవన్ అంటున్నాడు.. ఇలాంటి వ్యక్తులను నమ్మొచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. *పేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటు* మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా... బటన్లు నొక్కిన తర్వాత అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా...ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. రెండు బటన్లు నొక్కి 175కి 175 అసెంబ్లీ స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలు లేదు. సిద్ధమేనా?. మన గుర్తు ఫ్యాను. ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను. తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లమ్మా మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అక్కా, అన్న మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి రోజమ్మ మీ పక్కనే ఉంది. మంచి మనస్సు ఉన్న అమ్మగా మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. అప్పుడప్పుడు మాట కొంచెం కటువుగానే మనస్సు మాత్రం వెన్న. నా చెల్లిని ఆశీర్వదించవల్సిందిగా మీ అందరినీ రెండుచేతులు జోడించి పేరుపేరునా మీబిడ్డ ప్రాధేయపడుతున్నాడు. రెడ్డప్ప అన్న మీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, భీష్మాచార్యుడి వంటివాడు. మీ చల్లనిదీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచాల్సిందిగా మీఅందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాను అని తెలియజేస్తూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.