వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి హైదరాబాద్: బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు 2014-15లో రూ. 25 కోట్లు, 2015-16లో రూ. 35కోట్లు కేటాయించారని విమర్శించారు. సభలో 175 సభ్యుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తనకు ప్రభుత్వం స్థానం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సరైన విధివిధానాలను ఖరారు చేయకుండా ఇచ్చిన రూ. 65 కోట్లలో ఇప్పటి వరకు రూ. 16కోట్లు మాత్రమే ఖర్చు చేశామని చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ. 500 కోట్లలో మిగిలిన నిధులను కేటాయించాలని ఆయన సభలో డిమాండ్ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో దూప, దీప, నైవేద్యాలకు నోచుకొని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో నెలకు రూ. 2,500 ప్రతీ దేవాలయానికీ కేటాయించారని గుర్తు చేశారు. టీడీపీ వచ్చిన అనంతరం దానిని రూ. 5వేలు చేస్తామని హామినిచ్చి దానిని అమలు చేయకపోగా ఉన్న వాటిని సైతం తొలగించారని మండిపడ్డారు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధ బ్రాహ్మణులకు ఫించన్ ఇస్తామని, పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన టీడీపీ హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. సభలో ఈ అంశాలపై మాట్లాడితే ప్రభుత్వం నుంచి సరైనా సమాధానం కూడా రాలేదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అంశాలపై చర్చించడానికి పార్టీల ప్రమేయం అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిగిలిన రూ. 440 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.