బాక్సైట్, భూదోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

గిరిజనులకు అండగా వైఎస్ జగన్
ఈనెల 10న చింతపల్లిలో పర్యటన
టీడీపీ భూదందాపై బొత్స ఫైర్

వైజాగ్ః వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ భూదందాపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రంలోని విలువైన భూములన్నంటినీ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు, బంధువులకు అప్పనంగా కట్టబెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనానంతరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూములను దోచుకునేందుకు  ప్రభుత్వ పెద్దల కన్ను పడిందన్నారు. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు స్థానికంగా భూదందా కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. 

విశాఖలో ఎకరా రూ.7 కోట్ల చొప్పున పలికే భూమిని ప్రభుత్వ పెద్దలు తమ బంధుప్రీతికి రూ.  50 లక్షల రూపాయలకే ధారాదత్తం చేశారని బొత్స పైరయ్యారు.  విశాఖ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఇక్కడి అత్యుత్తమ సంస్థలకు భూకేటాయింపులు చేస్తే....చంద్రబాబు మాత్రం అయినవారికి భూములు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం సర్కార్ భూదోపిడీపై పోరాటం కొనసాగిస్తామని బొత్స ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
లోకేష్ సన్నిహితుడు, ఈసెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగికి చంద్రబాబు  ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా  కట్టబెట్టడంపై బొత్స ఫైరయ్యారు. బలకృష్ణ వియ్యంకుడి కంపెనీ వీపీఎస్ సంస్థకు జగ్గంపేటలో సుమారు రూ.250 కోట్ల భూమిని కారుచౌకగా అప్పగించడం ఆక్షేపణీయమని తూర్పారబట్టారు. పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ పార్క్ ల కోసం కేటాయించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చిత్తూరులో సుమారు రూ.21 కోట్ల భూమిని రూ.4 కోట్లకు కేటాయించారని...ఈరకమైన భూదోపిడీపై  ఉద్యమిస్తామని బొత్స స్పష్టం చేశారు. 

అదేవిధంగా బాక్సైట్ జీవోను రద్దు చేయాలని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత  తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ఈనెల 10న చింతపల్లిలో పర్యటిస్తారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా  వైఎస్ జగన్ ఆధ్వంర్యంలో చింతపల్లిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  . ప్రభుత్వం బాక్సైట్ జీవోను ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని తేల్చిచెప్పారు. 
Back to Top