హైదరాబాద్ః అసెంబ్లీలో సీఎం ప్రవర్తన రౌడీలను తలపించేలా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను వినకుండా ...రౌడీల్లా ప్రవర్తించి సస్పెన్షన్ వేశారన్నారు. ముఖ్యమంత్రిగా పేదవాడి ఆకలి కేకలను, వారి గోడును తెలుసుకున్నప్పుడే ...ఆ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దమాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత వరకు ఒక్క హామీని కూడా నేరవేర్చిన పాపాన పోలేదన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, పవన్‌కళ్యాణ్‌ల అండదండలతో... కులాలపై రాజకీయాలు చేసి బాబు ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. కుల,మత, ప్రాంతాలకు తేడా లేకుండా అందరికీ సమన్యాయం చేసిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.<br/>నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు, ఇంత వరకు ఒక్క ఇళ్లైనా నిర్మించారా, ఇళ్ల స్థలాలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. నిరు పేదలు పక్కా ఇళ్లలో నివసించాలనే ఆశయంతో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప పథకాలతో ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్ ది అన్నారు. చేసిన మోసాలను కప్పిపుచ్చుకోవడానికే మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీకి ఉన్నంత ప్రాధాన్యత.... ప్రభుత్వ అధికారులకు లేదని, చంద్రబాబు టీడీపీ దళిత ఎమ్మెల్యేలను కేవలం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కొవడానికే ఉపయోగించుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని సూచించారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నామస్మరణ తప్ప మరో ఆలోచన లేదన్నారు.