నెల్లూరు) పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఉండదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ లో చేరి ఉన్న పరువును పోగొట్టుకొన్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. పార్టీ మారిన వారంతా తమ పదవుల్ని తాకట్టు పెట్టినట్లు అని ఆయన అన్నారు.వెంకటాచలం మండలంలోని కంటేపల్లి లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేస్తున్నందున టీడీపీలో చేరామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చేసే పార్టీలో ఏం అభివృద్ధి కనిపించి చేరారని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన టీడీపీ మునిగిపోయే నావన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఛీత్కరించడం ఖాయమన్నారు.