ఒంగోలు : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బయటి పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. సహకార సంఘాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఇంతకాలంగా అణిగిమణిగి ఉన్న స్థానిక నాయకులు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్‌ఆర్‌సిపిలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే చీమకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు క్రిష్టిపాటి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారంతా వైయస్‌ఆర్‌సిపి విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ క్రమంలో చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు పాటిమీదపాలెం గ్రామం గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. ఆ గ్రామంలో ఒక్కరు కూడా మిగలకుండా అంతా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. జై జగన్ నినాదం ఆ గ్రామంలో మారుమోగుతోంది.
కాగా, చీమకుర్తి మండలంలోని పలు గ్రామాల సొసైటీ మాజీ అధ్యక్షులు, సభ్యులు కూడా వైయస్‌ఆర్‌సిపిలో చేరిన వారిలో ఉన్నారు. గ్రామాల్లో సొసైటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్‌ఆర్‌సిపిలోకి వలసలు పెరగడంతో పార్టీలో నూతనోత్తేజం ఉరకలెత్తుతోంది.
మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని తర్లుపాడు మండల సింగిల్ విండో అధ్యక్షుడు వెన్నా తిరుపతిరెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన.. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బాలినేని ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతిరెడ్డితో పాటు మరో 50 మంది పార్టీలో చేరారు.
అలాగే, చీమకుర్తి కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రావులపల్లి కోటేశ్వరరావు బుధవారం ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మండలంలోని నిప్పుట్లపాడు నుంచి మరో 50 మంది పార్టీలో చేరారు.