సమైక్య శంఖారావం సభకు పోలీసు అనుమతి

హైదరాబాద్ :

హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఈ నెల 26న‌ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగ సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. అనుమతి పత్రాలను సెంట్రల్ జో‌న్ ‌డిసిపి వి.బి. కమలాసన్‌రెడ్డి శుక్రవారం పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూద‌న్‌రెడ్డికి అందించారు.

ఈ నెల 16న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. 26వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు బహిరంగ సభ నిర్వహించుకునేలా అనుమతి ఇస్తున్నట్లు కమలాసన్‌రెడ్డి ఆ పత్రంలో పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించరాదని, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, సభకు హాజరయ్యే వారు అగ్గిపెట్టెలు, కవర్లు, బ్యాగులు సహా నిషేధిత వస్తువులు తీసుకు రాకూడదని, స్టేడియంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను నిలుపుకోవాలని షరతులు విధించారు.

Back to Top