జననేతకు పాలమూరులో అపూర్వ స్వాగతం

మహబూబ్‌నగర్, 1 అక్టోబర్ 2013:

హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు ‌వెళుతున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డికి పాలమూరు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వెంకటాద్రి ఎక్సుప్రెస్ రైలులో తమ అభిమాన‌ నాయకుడు శ్రీ జగన్‌ వస్తున్నారని తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం ఏడు గంటల నుంచే ఆయా రైల్వేస్టేషన్ల వద్ద నిరీక్షించారు. 16 నెలలుగా ప్రత్యక్షంగా చూడలేకపోయిన యువనేత కనిపించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్పాహం వెల్లువైంది. జగన్నినాదంతో రైల్వేస్టేషన్లు మార్మోగాయి.‌ పాలమూరు జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూ‌ర్ తదితర ‌స్టేషన్లలో రైలు బోగీలో నుంచి ప్రజలకు శ్రీ జగన్ అభివాదం చేసి వారి‌ పట్ల తనకున్న ఆప్యాయత, అనురాగాన్ని వ్యక్తంచేశారు.

జిల్లా కేంద్రం పాలమూరులో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాక కోసం పార్టీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు సైతం భారీగా తరలి వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. రాత్రి 10.35 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకున్న ఆయనకు పలువురు ‌నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  ‘జై జగన్, వచ్చాడు.. వచ్చాడు పులిబిడ్డ వచ్చాడు’ అంటూ చేసిన నినాదాలు.. కేరింతలతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. ‌హైదారాబాద్ నుంచి అదే‌ రైలులో వచ్చిన ప్రయాణికులు కూడా శ్రీ జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు.

Back to Top