వైయస్‌ఆర్‌సీపీది రాచబాట




– రహస్య పొత్తులు పెట్టుకునే అలవాటు వైయస్‌ఆర్‌సీపీకి లేదు
– బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే  లేదు
– వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వైయస్‌ జగన్‌ అనేకసార్లు చెప్పారు
– చంద్రబాబు కోసం ఓ వర్గం మీడియా పత్రికా విలువలను కాలరాస్తోంది
– బాబును మరోసారి అధికారంలోకి తేవాలనే తాపత్రయం ఎల్లోమీడియాది
– మీడియాను తాకట్టు పెట్టుకొని బతికే కొన్ని పత్రికలు ఉన్నాయి
– బాబు చెడు చేసినా అద్భుతమని రాసే పత్రికలున్నాయి
– పార్టీ ఫిరాయింపుల గురించి ఈ మీడియా రాయదు
– ఓటుకు కోట్లు కేసులో సోదాలు తప్పని కొన్ని పత్రికలు రాస్తున్నాయి
– వాస్తవాలను వాస్తవంగా చూని మీడియా మీడియానే కాదు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది రాచబాట అని, చెప్పింది చేసుకుంటూ వెళ్తామని, రహస్య పొత్తులు పెట్టుకునే అలవాటు, అఘాయిత్యం మాకు లేదని పార్టీ అధికార ప్రతిని«ధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రహస్య పొత్తులు పెట్టుకునే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు.  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అనేకమార్లు చెప్పినట్లు గుర్తు చేశారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. కొన్ని పత్రికలు విలువలను కాలరాస్తున్నాయని, చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  టీడీపీ అధికారంలోకి కొనసాగాలని కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. టీడీపీ నాయకులో, కార్యకర్తలో ఆ ప్రయత్నం చేస్తుంటే ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఫోర్తు ఎస్టేట్‌గా పిలువబడుతున్న పత్రికల్లో ఓ వర్గం మీడియా చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలని, అందుకోసం పత్రికా విలువలను మంటగలుతున్నారని విమర్శించారు. ఏది ఏమైనా మళ్లీ చంద్రబాబును అధికారంలో కూర్చొబెట్టాలన్నదే ఓ వర్గం మీడియా పత్రి విలువలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓ మంచి కుక్కను తీసుకెళ్తూ అది కుక్క కాదు..మేక అంటే కొన్ని పత్రికలు మేక అని బ్రహ్మండంగా రాస్తున్నాయన్నారు. అదే వైయస్‌ జగన్‌ ఓ మంచి మేకను తీసుకెళ్తుంటే అది మేక కాదు..కుక్క అని, అది కూడా పిచ్చి కుక్క అని రాస్తున్నారని వివరించారు. ఇలాంటి మీడియా సంస్థలను చూసి సిగ్గుపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. కొంత కాలంగా మీడియాను తాకట్టు పెట్టి కొన్ని పత్రికలు పబ్బం గడుపుకుంటున్నాయని, ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయన్నారు. వైయస్‌ జగన్‌ మంచి చేసినా అది మంచి కాదని, చంద్రబాబు చెడు చేస్తున్నా..అది మంచి అని రాస్తున్నారని తెలిపారు. అన్ని పత్రికలు కాదని, ఎల్లోమీడియాగా పిలువబడుతున్న పత్రికలు మాత్రమే అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యే చంద్రబాబు చంకన కూర్చుంటే అది అనైతికం అని రాయడం లేదు. చంద్రబాబు అద్భుతం చేస్తున్నారని రాశారు. వైయస్‌ జగన్‌ వారిని నిలువరించుకోలేకపోయారని ఆ పత్రికలు కథనాలు రాయడం అన్యాయమన్నారు. 

– ఈ రోజు కొన్ని పత్రికలు పొత్తు పొడిచిందని రాశారు. వైయస్‌ఆర్‌సీపీతో బీజేపీ పొత్తు ఖాయమని తప్పుడు కథనాలు రాశారు.  బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీకి సంబంధమే లేదని అనేకసార్లు చెప్పినా కూడా పొత్తు కుదిరిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు చెప్పిందే చెప్పి కుక్కను మేక చేసినట్లు చిత్రీకరిస్తున్నారు. వాస్తవాన్ని వాస్తవంగా రాయని పత్రిక పత్రిక కాదని, చూపించని మీడియా నిజమైన మీడియా కాదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇన్ని వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ విషయంపై ఏ నాడు కూడా ఈ ఎల్లో మీడియా రాయడం లేదు. రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతుంటే అదేదో జరిగిపోతుందన్నట్లుగా కథనాలు రాశారన్నారు. చంద్రబాబు ఇవాళ ఒక మాట అన్నారని, ఆ మాట ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడిపోయిన తెలుగు రాష్ట్రం దాంతో కలిసి ఉండాలని భావిస్తే..పైన నరేంద్ర మోడీ అడ్డుపడ్డారని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు చాలా తెలివి గల నాయకుడని, కేసీఆర్‌తో కలిసి ఉండాలనుకుంటే ..స్టిఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు రేవంత్‌రెడ్డితో ఇప్పించేవారా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ను ముంచాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని, వాళ్లే ఈయనను ముంచారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించింది చంద్రబాబే అని, ఆయన కాంగ్రెస్‌తో జత కడితే అద్భుతం, అమోఘమని ఎల్లోమీడియా రాస్తుందన్నారు. ఇలాంటి పత్రికలకు, మీడియాకు బుద్ధుందా అని ప్రశ్నించారు. వాస్తవాలు, అన్యాయాలు, అవినీతి గురించి రాస్తున్నారా అని నిలదీశారు. రహస్య పొత్తులు పెట్టుకునే అలవాటు వైయస్‌ఆర్‌సీపీకి ఎన్నడూ లేదని వెల్లడించారు. రహస్య పొత్తులు, డబ్బులతో జనాన్ని కొనే కార్యక్రమం, ఎమ్మెల్యేలను కొనే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు. వైయస్‌ జగన్‌కు అలాంటి గుణం లేదన్నారు. వైయస్‌ జగన్‌కు బెయిల్‌ వస్తే సోనియాతో కలిసిపోయారని చంద్రబాబు ఆ రోజు ఆరోపణలు చేశారన్నారు. మాపై ప్రచారం చేసిన చంద్రబాబు ఇవాళ చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎలా జతకడుతారని ప్రశ్నించారు. ఎన్ని కూతలు కూసినా, ఎన్ని రాతలు రాసినా మాది రాచబాట అని చెప్పింది చేస్తామని, రహస్యపొత్తులు పెట్టుకునే అలవాటు, అఘాయిత్యం వైయస్‌ఆర్‌సీపీకి లేదన్నారు. గత ఎన్నికల్లో అలాగే చేశామని, ఇప్పుడు అలాగే చేస్తామని, భవిష్యత్తులో కూడా అలాగే చేస్తామని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీతో మేం ఏవిధమైన పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా లేమని వెల్లడించారు. చంద్రబాబు గురించి ఏమైనా రాసుకోండి కానీ, మా గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. కొంత కాలం ఎల్లోమీడియా ఆటలు సాగాయని, ఎల్లకాలం సాగవని హెచ్చరించారు. మీ బండారం బయటపడిందని, మీ తాపత్రయం నెరవేరదని గుర్తించుకోవాలన్నారు. ఎల్లోమీడియా రాసే కథనాలు ప్రజలు నమ్మవద్దని ఆయన మనవి చేశారు. 
 
Back to Top