వైయ‌స్ జగన్ అన్ని కులాలను గౌరవించారు

ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో  అన్ని కులాలను గౌరవించార‌ని, పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశార‌ని మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. గురువారం శాసనమండలి మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ..ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామ‌న్నారు. కానీ ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ‌ నుంచి బయటికి పంపించేందుకు చూసింద‌ని త‌ప్పుప‌ట్టారు.  సూపర్ సిక్స్ కు నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తోందని,  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి లేదని ధ్వ‌జ‌మెత్తారు. ఓటేశారు..మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంద‌ని ఆక్షేపించారు. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును ఆయ‌న ఖండించారు. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని ఆకాంక్షించారు.  వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయ‌ని, ఉద్య‌మించిన వారిపై 
 టిడిపి కేసులు పెట్టింద‌ని గుర్తు చేశారు. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైయ‌స్ జ‌గ‌న్‌దే అన్నారు.  ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు పై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ త‌ప్పుప‌ట్టారు. 
వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌వాడ న‌డిబొడ్డున అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింద‌న్నారు. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చద‌ని విమర్శించారు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేష‌మ‌న్నారు.  గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాల‌ని సూచించారు. అందరికీ మంచి చేయాలని ఆయ‌న కోరారు. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నార‌ని,  రోజూ ఆవుకథ చెబితే ఎలా? అంటూ నిల‌దీశారు. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైయ‌స్ఆర్‌సీపీకి అలవాటు లేద‌న్నారు. అదే అలవాటు వైయ‌స్ఆర్‌సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లమ‌ని బొత్స సత్యనారాయణ  వ్యాఖ్యానించారు.

Back to Top