కార్పొరేట్ చేతికి ప్రభుత్వాసుపత్రులు..!చిత్తూరు ప్రభుత్వాసుపత్రి.. అపోలోకి అప్పగింతలు..!<br/>చిత్తూరుః పేదలకు వైద్యం ఇకనుంచి అందని ద్రాక్షగానే మిగలనుంది. అనారోగ్యం చేస్తే ప్రభుత్వాసుపత్రుల వైపు చూసే రోజులకు పచ్చప్రభుత్వం చెల్లుచీటీ పాడుతోంది. ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ చేతుల్లో పెడుతూ చంద్రబాబు సామాన్య ప్రజానీకం నడ్డివిరుస్తున్నారు. సొంత జిల్లా నుంచే తన కుట్రలకు పునాది వేస్తున్నాడు. దశాబ్దాల చరిత్ర గల చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి పేరుతో అపోలోకు ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చేశారు. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులన్నింటినీ మెల్లగా ప్రైవేటు పరం చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సామాన్యుని ఆరోగ్యానికి భరోసా లేకుండా చేస్తూ వైద్యాన్ని దూరం చేస్తున్నాడు.<br/>ఎల్లలు దాటిన గొప్పలు..!కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన పాలకులు..ఇప్పుడు ఉన్న వాటిని కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పుతూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఔట్ పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించే చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ మయం చేసేస్తున్నారు. 17.23 ఎకరాల్లో విస్తరించియున్న సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే ఆస్తిని అప్పనంగా అపోలోకు కట్టబెట్టారంటే ..పచ్చనేతలకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. <br/>అప్పనంగా అపోలోకి కట్టబెట్టేశారు.!అరకొర సేవలతోనైనా నిరుపేదలకు నిలువ నీడగా నిలుస్తున్న ప్రభుత్వాసుపత్రిని ..మెడికల్ కాలేజ్ కోసం అపోలోకి అఫ్పగించడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. రూ. 50 కోట్ల ఖర్చు చేస్తే అధునాతన పరికరాలు ఏర్పాటుచేసుకోవడం తోపాటు భవనం ఆధునీకరణం సహా వైద్య సిబ్బందిని నియమించుకోవచ్చని అంటున్నారు. అలాంటిది రూ.200కోట్ల ఆస్తిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధారాదత్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పేదల జేబుకు చిల్లులు పడేలా చేస్తున్న ప్రభుత్వ కుట్రలపై భగ్గుమంటున్నారు. <br/>ప్రభుత్వంపై ప్రజాగ్రహం..!వచ్చే ఏడాది నుంచి అపోలో ఆధీనంలోకి వెళ్లనున్న ఈఆస్పత్రి ద్వారా అందించే ప్రతిసేవకు యూజర్ ఛార్జీలు తప్పవని అధికారులే చెబుతున్నారు. ఇదే విధానం కొనసాగితే పేదప్రజలకు వైద్యం దూరం కావడంతో పాటు... ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కార్పొరేట్ కింద పనిచేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ నియమాకాలకు అవకాశం లేకపోతే రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి కష్టకాలం దాపురించినట్లే.