<br/>హైదరాబాద్) తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అత్యంత శ్రద్ధ పెడుతున్న పథకాల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒకటి. దీని ద్వారా పట్టిసం అనే గ్రామం నుంచి గోదావరి నీటిని పైకి తోడి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నదిలో కలుపుతారు. దీంతో అక్కడ కృష్ణా డెల్టాకు మరింతగా నీరు వినియోగం లోకి వస్తుంది. కానీ, ఇదే పట్టి సీమను రాయల సీమకు నీటిని తోడిపోసే ప్రాజెక్టుగా చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రచారం చేసుకొంటున్నారు. కృష్ణా నదిలో దిగువ భాగాన నీటిని పోస్తే, ఎగువ భాగం నుంచి రాయల సీమకు నీరు ఎలా అందుతాయనేది అంతు పట్టని విషయం. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఇప్పుడు తాజా గా తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పట్టి సీమ పేరుతో రాయల సీమకు ఒరిగేదేమీ లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పటకైనా వాస్తవాలు గ్రహించి రాయల సీమకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మభ్య పెట్టడం కన్నా వాస్తవాల ఆధారంగా ప్రజలకు ఉపయోగ పడాలని వివరించారు. పట్టి సీమ నుంచి కృష్ణా నదికి నీళ్లు మళ్లిస్తారు. అక్కడ నుంచి రాయల సీమకు నీరు ఎలా వస్తాయి అనేది తెలియదు. అసలు వస్తాయా రావా అన్నది కూడా తెలియదు. ఈ క్రమంలోనే రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు ఇవ్వాలని జేసీ డిమాండ్ చేస్తున్నారు. <br/>