అమరావతి : అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు.. ఎదురేగి స్వాగతాలు.. అందరి నోటా ప్రశంసల మధ్య పండగ వాతావరణంలో బుధవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభమైంది. మూడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరించి.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రజాప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు నూతనోత్సాహంతో ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, అధికారుల బృందానికి ఊరువాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకూ వెళ్లిన ప్రజాప్రతినిధులకు.. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత అన్నలా, తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తుండటం వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని అక్కచెల్లెమ్మలు ప్రజాప్రతినిధులకు వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఉన్నత చదువులు చదివించుకోగలిగామని.. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కూడా వస్తున్నాయని సంతోషంతో వివరించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా కట్టిస్తూ సొంతింటి కలను నెరవేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన రోజునే అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో.. ‘ప్రజలకు ఇంత మంచి చేశాం అని సగర్వంగా కాలరెగరేసి చెప్పే పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ మాకు కల్పించారు’ అని ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అడుగడుగునా ఆదరణ ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన హామీలు.. ఇంటి యజమానురాలైన అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి ప్రజాప్రతినిధులు అందజేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మూడేళ్లలోనే 95 శాతం అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలాల పంపిణీ మొదలు.. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెప్పించే వరకు.. జిల్లాల పునర్ వ్యవస్థీరణ నుంచి పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. వీటన్నింటిపై న్యాయస్థానాల్లో కేసులు వేసి మారీచుల్లా అడ్డుకుంటున్న టీడీపీ.. దుష్ఫ్రచారం చేస్తున్న ఎల్లో మీడియా వ్యవహార శైలినీ ప్రజలకు వివరించారు. మూడేళ్లలో దేవుడి దయ, మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని.. ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మనందరి ప్రభుత్వానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు తెగేసి చెప్పారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగి మరీ.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇంటింటా ఘన స్వాగతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ తిరిగారు. చిరు జల్లుల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో చిరుజల్లుల మధ్య కార్యక్రమం కొనసాగింది. ప్రజాప్రతినిధులు ఒకవైపు ప్రజలతో మమేకమవుతూనే, మరోవైపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పండుగ వాతావరణంలో కొనసాగింది. డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, పింఛన్ పథకాల ద్వారా తన కుటుంబానికి రూ.1.50 లక్షకు పైగా లబ్ధి కలిగినట్లు సురేంద్రనగరానికి చెందిన శ్యామల అనే మహిళ చెప్పారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. మూడేళ్ల పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. పలు చోట్ల వర్షం పడుతున్నప్పటికీ ప్రజలు ప్రజా ప్రతినిధుల కోసం వేచి చూసి.. ఘనంగా స్వాగతం పలికారు.