అయ్యా.. బాబూ.. నిరుద్యోగ భృతి ఇవ్వండని యువత అడుగుతుంటే.. ఉద్యోగాలొస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కనీవినీ ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30 వేల మందికి వందల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్‌లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని తేలింది. కూటమి సర్కారు వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చయ్యే రూ.1500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే.. పలుకుబడిగల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక విధాన పత్రంలోనే స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం రూ.177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో వృత్తిపరమైన సర్వీసు పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.747 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది. మేనిఫెస్టోకు మంగళం! సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పలుకుబడి గల వారికి నెలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ కన్సల్టెంట్లుగా నియమించుకుంటోంది. సామాన్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయం గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా, వారికి వేతనాల కింద ఏటా రూ.1,500 కోట్లు చెల్లించిందని గత నవంబర్‌లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో వలంటీర్లను తొలగించేసింది. తమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉంటే వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.2,604 కోట్లు చెల్లించిందని గత నవంబర్‌లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 94,420కి తగ్గిపోయినట్లు తెలిపింది. వారికి వేతనాల కింద ఏటా రూ.2,329 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఉద్యోగాల కుదింపే లక్ష్యం గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా కూటమి సర్కారు భర్తీ చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గిపోయింది. అలాగే గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది ఉండగా, కూటమి సర్కారులో 53,122కు తగ్గిపోయింది. నాడు మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో 72,747కు తగ్గిపోయింది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గిపోయింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 46,646కు పడిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీఆర్‌ఏలు 19,406 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 18,435కు తగ్గిపోయింది. దీన్నిబట్టి ఉద్యోగాలను తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టమవుతోంది.