

















టీడీపీ నేతల దాష్టీకంతో ‘స్థానిక’ ఉప ఎన్నికలు మళ్లీ వాయిదా
టీడీపీ నేతల గొడవతో గాండ్లపెంట, రామగిరిలో హాజరు కాని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు..పశ్చిమగోదావరిలో రెండో రోజూ ఎంపీపీ ఎన్నికలు జరగనివ్వని పచ్చ మూకలు
అత్తిలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు హాజరవకుండా రోడ్లు దిగ్బంధం
మాజీ మంత్రి కారుమూరి నివాసం వద్ద ఉపాధి కూలీల మోహరింపు
యలమంచిలిలో గొడవ.. కళ్లు తిరిగి పడిపోయిన ఎన్నికల అధికారి
నరసరావుపేట, కారంపూడిలో కోరం లేక వైస్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా
గోపవరంలో టీడీపీ హైడ్రామాతో ఉప సర్పంచ్ ఎన్నిక నిలిపివేత
అమరావతి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హెచ్చరికలు, గొడవల కారణంగా గురువారం ఏడు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు... శుక్రవారం కూడా వాయిదా పడ్డాయి. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలిలో ఎంపీపీ, పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడిలో వైస్ ఎంపీపీ, వైఎస్సార్ జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్ పదవులకు శుక్రవారం ఎన్నిక నిర్వహించలేకపోయారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40 స్థానాల్లో (ఒక రెబల్‌తో కలిపి) తన హవాను చాటుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఏడు చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక నిర్వహించే కార్యాలయం వద్దకు రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
పోలీసులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ వశమైతే ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత మరింత ప్రబలుతుందని అధికార పార్టీ పెద్దలు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోవాలంటూ స్థానిక నేతలకు కనుసైగ చేశారు. దీంతో శుక్రవారం కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేకపోయారు.
టీడీపీ నేతల దౌర్జన్యకాండ..
టీడీపీ నేతల దాష్టీకంతో శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు తిరిగి వాయిదా పడ్డాయి. నిర్ణీత సమయంలోగా మూడింట రెండు వంతుల సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలో ఏడుగురు సభ్యులకు గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెండు రోజులుగా టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక సజావుగా జరిగితే వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ పదవులు దక్కుతాయని భావించి గాండ్లపెంటలో టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, రామగిరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ ఎన్నిక జరగకుండా గురువారం ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నికల వాయిదా..
ఎంపీపీ: 4
వైస్ ఎంపీపీ: 2
ఉప సర్పంచ్: 1
మొత్తం: 7
పశ్చిమలో కూటమి అధికార మదం
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలను రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెరవెనుక నుంచి తంతు నడిపించారు. సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా మహిళలను అత్తిలికి తరలించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు.
ఒక్కొక్కరికి రూ.500 నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని చెప్పి ఉంచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటారు సైకిళ్లపై హల్‌చల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు. 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు. శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎక్కడున్నదీ తెలియకపోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చేస్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు, ఆటోలు, ఇతర అన్ని వాహనాలను తనిఖీ చేసి వైఎస్సార్‌సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు చేష్టలుడిగి చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికలకు హాజరు పర్చేందుకు మాజీ మంత్రి కారుమూరి పోలీస్ అధికారులను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల నిర్వాకం
పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యం కారణంగా కోరం లేకపోవడంతో ఈ రెండు చోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో కేవలం నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కారంపూడిలో ఒకే ఒక్కరు హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీ సభ్యులు రాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. దీంతో కోరం లేదన్న విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
బలం లేకపోయినా సరికొత్త నాటకం
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఎన్నిక ప్రారంభానికి ముందే కూటమి నాయకులు నాటకీయ పరిణామాలకు తెరలేపారు. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు వచ్చి సత్యశ్రీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూటమి నాయకులు ఆమె కుమార్తె ద్వారా సత్యశ్రీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాణం పోయినా వైఎస్సార్‌సీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేయడంతో పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్ కార్యాలయానికి తీసుకు వచ్చి దించడం గమనార్హం.
అనంతరం నిర్ణీత సమయానికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్‌సీపీ నుంచి 12 మంది, కూటమికి చెందిన నలుగురు సభ్యులు హాజరయ్యారు. అటెండెన్స్ ప్రక్రియ పూర్తయ్యాక కూటమి సభ్యులు లేచి తమను వైఎస్సార్‌సీపీ సభ్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నిక ఏ విధంగా జరిపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సంగతి తేల్చాలంటూ ఘర్షణ వాతావరణం, గందరగోళ పరిస్థితులు సృష్టించారు.
ఈ నేపథ్యంలో తనకు గుండెల్లో దడగా ఉందంటూ రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నిక నిర్వహించడానికి సరైన వాతావరణం లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీఓ ఎ.ప్రేమాన్విత్ ప్రకటించారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉండగా కూటమి సభ్యులను భయపెట్టాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించినా వారు స్పందించలేదు.
వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ హైడ్రామా
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులపై దౌర్జన్యం, దాడులకు దిగటంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు హైడ్రామాకు తెర తీశారు. ఎన్నికల కార్యాలయంలో.. పథకం ప్రకారం టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉప సర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు.
ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్‌ను లాక్కొని చించేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా కలిసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని కుర్చీలో కూర్చుండిపోయారు.
అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఈ హైడ్రామా చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.