తిరుమలలో అసలేం జరుగుతోంది?

కొండపై ఎర్ర చందనం, మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి

మంత్రి లోకేష్‌ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దందా 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఫైర్‌

తిరుపతి: తిరుమలలో తరచూ చ‌ట్ట‌ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి మండిప‌డ్డారు. తిరుమల కొండపై నాలుగు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నార‌ని, మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయ‌న్నారు. మంత్రి నారా లోకేష్‌ పీఏ పది నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారు అంటే అసలేం జరుగుతోంది? అంటూ భూమ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ.. `మంత్రి లోకేష్‌ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దందా చేస్తున్నారు. గతంలో నాలుగు వేల లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు ఎనిమిది వేలకు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డుపై వాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే.. చంద్రబాబు?. ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారు చెప్పండి చంద్రబాబు.

ప‌వ‌న్ మౌన‌మేలా?
అటవీ శాఖ పరిధిలో పాపవినాశనం చుట్టూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడరు?. టీటీడీ అధికారిగా కాకుండా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీ అనుంగు శిష్యుడిగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది మీ పాలనలోనే. కూటమి పాలన పాపాన్నిపెంచడానికే ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు గుర్తించండి. ధర్మ వ్యతిరేకంగా మీ పాలక మండలి, సభ్యులు వ్యవహరిస్తున్నారు.

పీ4 ఫిలాస‌ఫీ..మాన‌వాళికి విఘాతం
చంద్ర‌బాబు తెబుతున్న‌ పీ-4 ఫిలాస‌ఫీ మాన‌వాళి మ‌నుగ‌డ‌కే విఘాతం. రెండు లక్షల 80వేల కోట్లు పేదలకు సంక్షేమ ప‌థ‌కాలను డీబీటీ రూపంలో నేరుగా డ‌బ్బులు పంచిన ఘనత వైయ‌స్ జగన్‌కే దక్కింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటై 10 నెలలు అవుతున్నా 5 శాతం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. మార్గదర్శి బంగారు కుటుంబం అంటూ నటనలు చేస్తున్నారు, ఇదంతా ఆర్థిక ద్రోహమే కానీ, మరొకటి లేదు. ఈ మాయ ధనవంతులు.. పేదలకు సహాయం చేయడం అన్నది సాధ్యం కాని విషయం. పేద వాళ్ళు అందరూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గమనించాలి. పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మాత్రమే. పీ-4 ఫిలాసఫీ మానవాళికి విఘాతమే తప్ప, ఎలాంటి మేలు జరగదు` అని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు.  

Back to Top