న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీ సమాజానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని మా పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లుపై వైయస్ఆర్‌సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిందన్నారు. ఇవాళ మళ్లీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ ఎంపీలు ఓటేస్తామన్నారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారని తప్పుపట్టారు. చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలని, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందని, ఇదిలాగే కొనసాగితే, దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉందని ఎంపీ మిథున్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్ర మంత్రికి లేఖ కడపలోని ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, వేడుకలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, భక్తుల సౌకర్యార్ధం రైళ్లను ఒంటిమిట్టలో ఆపాలని ఆ లేఖలో మిథున్‌రెడ్డి కోరారు. భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి రాసిన లేఖలో కోరారు.