అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపింది. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో వైయస్ఆర్‌సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలిన విషయం తెలిసిందే. జూన్ 15– ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్‌లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ గెలుస్తుందని తేలింది. కాగా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్‌సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది. వైయస్ఆర్‌సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన.. వైయస్ఆర్‌సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ తొలి నుంచి చెబుతోంది.