ప్రధాని మోదీకి వైయ‌స్ జగన్ లేఖ 

 తాడేప‌ల్లి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ‍ప్రధాని నరేంద్ర మోదీకి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైయ‌స్‌ జగన్‌ కోరారు. 

‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైయ‌స్‌ జగన్‌ లేఖలో కోరారు. 

మరోవైపు డీలిమిటేషన్‌ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు.

వైయ‌స్ జ‌గ‌న్ లేఖ..

Image

Image

Image

Back to Top