తాడేపల్లి: కుప్పం వేదికగా వైయస్ఆర్ చేయూత పథకం కింద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.14,110.62 కోట్ల లబ్ధి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైయస్ఆర్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. వీటితో పాటు 60 ఏళ్లు నిండిన అర్హులైన వారికి వైయస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే కచ్చితంగా పింఛన్ పంపిణీ చేస్తోంది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి అవ్వల వరకు అందరినీ అన్ని దశల్లోనూ కంటికి రెప్పలా ఆదుకుంటోంది. జీవనోపాధి పెంపు ఇలా.. ఇప్పటి వరకు 5,82,662 మంది అక్కచెల్లెమ్మలు వైయస్ఆర్ చేయూత ద్వారా కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్నారు. వీరిలో 1.10 లక్షల మంది కిరాణా దుకాణాలు, 60,995 మంది వస్త్ర వ్యాపారం, 1,15,446 మంది ఇతర జీవనోపాధి, 2,96,221 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో రాణిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక వైయస్ఆర్ చేయూత మహిళా మార్ట్ ద్వారా అక్కచెల్లెమ్మలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతోంది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న అక్కచెల్లెమ్మలకు ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేటు కంటే తక్కువకు నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు తీసుకుంది. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్ భాగస్వామ్యంతో మార్కెట్‌లో ఇస్తున్న ధర కంటే లీటర్ పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అందిస్తోంది. పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక శక్తిని అందిస్తే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, జీవన స్థితిగతులు మెరుగు పడతాయన్న ఉద్దేశంతో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా 5,30,01,223 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,39,013.40 కోట్లు లబ్ధి చేకూర్చారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కుప్పంలో పర్యటించనున్నారు. అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం హోదాలో వైయస్ జగన్ తొలిసారి ఇక్కడ పర్యటించనున్న నేపథ్యంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కుప్పం నిండిపోయింది. కుప్పం చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు మూడు కిలోమీటర్ల మేర దారిపొడవునా స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, ముఖ్యమంత్రి ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, రేణిగుంట మీదుగా 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. ఇక్కడ కార్యక్రమాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.10 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.